రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద గాలింపు ఆర్కె ఉనికిపై లెక్కలేనన్ని అనుమానాలు మావోయిస్టుల బంద్ తో ఏజెన్సీ ఏరియాలో టెన్షన్ ఒకవైపు మావోయిస్టులు మరోవైపు గ్రేహౌండ్స్ దళాలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కూడా ఎన్నడూ లేని విధంగా ఒక వ్యక్తి కోసం వేలాది కిలోమీటర్ల ప్రాంతాన్ని రెండు వర్గాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ఒట్టి గాలింపు అనేకంటే జల్లెడ పడుతున్నాయని చెప్పవచ్చు. ఇంతకీ ఎవరా వ్యక్తి అనే కదా సందేహం. అతనే రామకృష్ణ అలియాస్ ఆర్కె. దేశంలో మావోయిస్టు అగ్రనేత. ఏపి ప్రభుత్వానికి మోస్ట్ వాటెండ్. గడచిన వారం రోజులుగా ఒకవైపు మావోయిస్టులు మరోవైపు గ్రేహౌండ్స్ పోలీసు దళాలు మొత్తం ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు ప్రాంతాలను జల్లెడపడుతున్నాయి. మావోయిస్టులేమో ఆర్కెను కాపాడుకోవాలని చూస్తుండగా పోలీసు దళాలేమో మట్టు పెట్టాలన్న ఏకైక లక్ష్యంతో గడచిన వారం రోజులుగా అవిశ్రాంతిగా కూంబింగ్ జరుపుతూనే ఉన్నాయి.
దాదాపు వారం రోజుల క్రితం ఏఒబిలోని మల్కనగిరి ప్రాంతంలో మావోయిస్టులు ప్లీనరీ జరుపుకుంటుండగా గ్రేహౌండ్స్ దళాలు దాడి చేసాయి. ఆ దాడిలో 25 మావోయిస్టులు ప్రాణాలు వదిలారు. ఆ సమయంలో ఆర్కె కూడా అక్కడే ఉన్నారన్న పక్కా సమాచారంతోనే పోలీసు దళాలు దాడులు చేసాయి. అయితే, మృతి చెందిన మావోయిస్టుల్లో ఆర్కె కూడా ఉన్నారని ఒకసారి లేరని మరోసారి ప్రచారం జరిగింది. పోలీసులు జరిపించిన పంచనమాలో ఆర్కె మాత్రం లేరన్న విషయం స్పష్టమవటంతో ఉద్రిక్తత మొదలైంది.
ఎన్ కౌంటర్ జరిగిన మరుసటి రోజు నుండే బుల్లెట్ గాయాలైన ఆర్కెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ హక్కుల సంఘాల నేతలు వరవరరావు, హరగోపాల్ తదితరులు వాదన వినిపించటం మొదలుపెట్టారు. దాంతో అందరిలోనూ ఆర్కె ఉనికిపై అనుమానాలు మొదలయ్యాయి. దానికి తోడు మావోయిస్టులు కూడా ఆర్కె కనిపించటం లేదని ప్రకటించారు.
పోలీసుల ఎన్ కౌంటర్ లో ఆర్కె మరణించటమో లేదా తప్పించుకోవటమో జరిగి ఉంటుందని మావోయిస్టులు అనుమానాలు వ్యక్తం చేసారు. చనిపోతే మృతదేహం ఎక్కడో బయటపడాలి. లేదా తప్పించుకుని ఉంటే మావోయిస్టులకు ఏదో ఒక రూపంలో సమాచారం అంది ఉండాలి.
అయితే పై రెండు కూడా ఇంత వరకూ జరగలేదు. దాంతో ఆర్కెను పోలీసులే దాచేసి నాటకాలు ఆడుతున్నారేమోనని హక్కుల సంఘాల నేతలు న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. న్యాయస్ధానం కూడా ఈ విషయంలో తీవ్రంగా స్సందించింది. పోలీసుల ఆధీనంలోనే ఆర్కె ఉంటే వెంటనే ప్రవేశపెట్టాలని కూడా ఆదేశాలు జారీ చేయటం గమనార్హం. ఈ నేపధ్యంలోనే పోలీసుల చర్యలకు నిరసనగా ఏపి, తెలంగాణా, ఒడిస్సా, ఛత్తీస్ఘర్, మహారాష్ట్రలో గురువారం బంద్ కు పిలుపిచ్చారు.
ఏక్షణంలోనైనా మావోయిస్టులు ప్రతీకార దాడులకు దిగవచ్చన్న అనుమానంతో పోలీసులు ఏజెన్సీ ఏరియలోని వివిధ రాజకీయ పార్టీల నేతలను అప్రమత్తం చేసారు. మావోయిస్టులు లక్ష్యంగా చేసుకుంటారన్న అనుమానం వచ్చిన నేతలెవరినీ కొంత కాలం పాటు మైదాన ప్రాంతాలను వదిలి ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళ్ళవద్దని స్పష్టం చేసారు. బంద్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా సుమారు ఐదు వేలమంది పోలీసులు ఏఒబి ప్రాంతంలో గాలింపు చర్యలను ముమ్మరం చేసారు.
ఆర్కె ఉనికి లభించకపోవటంతో సర్వత్రా ఉత్కంఠ రేగుతోంది. ఏజెన్సీ ఏరియాలో ఎక్కడ మృతదేహం కనిపించిందన్నా అది ఆర్కేదే అన్న అనుమానాలతో ఇటు పోలీసులు అటు హక్కుల సంఘాల నేతలు పరుగులు తీస్తున్నారు. కాదని తెలీగానే ఒకరు నిరాశలో ముణిగిపోతుంటే మరొకరు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇలా ఎంత కాలమన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.
