గాల్వాన్ లోయలో చైనా దుర్వినీతికి ఎదురొడ్డి పోరాడి వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో ఏర్పాటు చేసారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 

జిల్లా ఆర్యవైశ్య సంఘం సహకారంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు కోన శ్రీనివాసరావు, ఆయన సోదరుడు హనుమాన్ బాబు చేతులమేధాలుగా ఆవిష్కరించారు. ఈ సోదరులు ఇప్పటికే గ్రాంలో అల్లూరి, గాంధీజీ, పొట్టి శ్రీరాములు, కాటన్ దొర వంటి మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసారు. 

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలానికి చెందిన శిల్పి చంద్రశేఖర్ అచ్చం  ఉట్టిపడేలా కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని చెక్కారు. ఈ విగ్రహం తమ గ్రామంలో ఏర్పాటు చేయడం గర్వంగా ఉందంటున్నారు గ్రామస్థులు. 

ఇకపోతే... గాల్వాన్ అమరువీరులకు మరింత గౌరవం ఇవ్వాలని భారత ప్రభుత్వం సిద్ధమయినట్లు సమాచారం. నాటి ఘర్షణలో అసువులు బాసిన ఈ 20 మంది సైనికుల పేర్లను ‘ నేషనల్ వార్ మెమోరియల్ ’పై చెక్కేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

మరికొద్దినెలల్లో ఇది ప్రారంభం కానున్నట్లు సమాచారం. కాగా జూన్ 15న లడఖ్‌లోని గల్వాన్ వ్యాలీలో పెట్రోలింగ్ పాయింట్ 14 చుట్టూ చైనా ఒక పరిశీలనా పోస్టును నిర్మించడాన్ని భారత సైనికులు వ్యతిరేకించారు.

దీంతో ఇరు దేశాల దళాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. చైనా సైనికులు రాళ్లు, మేకులు దించిన కర్రలు, ఇనుప రాడ్లతో భారత జవాన్లపై దాడి చేశారు. నాటి ఘటనలో తెలుగు తేజం, 16 బిహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ బీ సంతోష్ బాబు సహా 20 మంది సైనికులు మరణించారు. 

చైనా వైపున 35 మంది చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అయితే చైనా వారి జవాన్లకు సైనిక లాంఛనాలతో కాదు కదా.. కనీసం చనిపోయిన వారి పేర్లను కూడా వెల్లడించలేదు. కానీ మనదేశం మాత్రం భారత జవాన్ల త్యాగాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది.