అమరావతి: తన పత్రికలో ప్రచురించిన ఓ వార్తాకథనానికి గాను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ చిక్కుల్లో పడ్డారు. హానీ ట్రాప్.. ఇద్దరు కలెక్టర్ల కహానీ పేరుతో ప్రచురించిన ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి లీగల్ నోటీసులు వెళ్లాయి. రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె. శ్రీనివాస రెడ్డి ఆ లీగల్ నోటీసులను పంపించారు. 

కలెక్టర్ల పరువు ప్రతిష్టలను దెబ్బ తీసే విధంగా వార్తాకథనం ప్రచురించినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, దాన్ని పత్రికలో ప్రచురించాలని ఆయన సూచించారు. వారం లోపు స్పందించకపోతే తదుపరి చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. 

స్వాతంత్ర్యం సిద్ధించిన రోజుల నుంచి కలెక్టర్లను ఓ వ్యవస్థగా ఎంతో గౌరవంగా చూస్తున్నారని, అలాంటి కలెక్టర్ల వ్యవస్థపై అభాండాలు వేస్తూ బురద చల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తూ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను చేరువ చేయడమే కాకుండా ప్రజలతో విడదీయరాని బంధాన్ని కొనసాగిస్తూ పాలనను ముందుకు తీసుకుని వెళ్తున్నామని ఆ లీగల్ నోటీసులో అన్నారు. 

సమతావాదం, లౌకికవాదం, మానవతావాదం వంటి ఉత్కృష్టమైన సిద్ధాంతాలను నిలబెడుతున్నామని, నిస్వార్థంగా ప్రజలకు సేవలందిస్తూ ప్రజల మద్దతు పొందుతూ సంపాదించుకున్న కలెక్టర్ల వ్యవస్థను ఒక కలం పోటుతో దిగజార్చారని అన్నారు. ఇలాంటి ప్రయత్నాలు జర్నలిజం నైతిక పతనాన్ని నిరూపిస్తున్నాయని అన్నారు. 

మీ రాజకీయ బాసులను సంతృప్తి పరిచేందుకు అబద్ధపు రాతలతో గోబెల్స్ ప్రచారం చేస్తున్నందుకున మీపై జాలి ప్రదర్శిస్తున్నామని, మీరు నైతిక విలువలను పూర్తిగా గాలికి వదిలేసి అబద్ధాల చుట్టూ సంచరిస్తున్నారని ఆంధ్రజ్యోతి యాజమాన్యాన్ని ఉద్దేశించి అన్నారు. 

లీగల్ నోటీసులోని వివరాలు ఇంకా ఇలా ఉన్నాయి....

* మీ కథనం జర్నలిజం విలువలను ఉల్లంఘించే విదంగా ఉంది. అంతేకాక దురుద్దేశంతో కూడుకున్నది కూడా. కొందరు నైతిక విలువలు లేని వ్యక్తుల దుష్ప్రవర్తనను సాకుగా తీసుకుని మొత్తం ఐఎఎస్ వ్యవస్థపైనే విషం చిమ్మతూ మీరు కథనం రాశారు. 

* రాజకీయ లబ్ధి కోసం మాత్రమే మీరు ఇలా చేశారు. మీ బురదజల్లుడు, తప్పుడు నిందారోపణల వల్ల ప్రజలకు నిబద్ధతతో సేవ చేస్తున్న దేశంలోని అందరు కలెక్టర్ల నైతిక స్థయిర్యాన్ని దెబ్బ తీశారు. వాస్తవాలు తెలుసుకోకుండా, తటస్థంగా ఉండాలనే జర్నలిజం విలువలకు పాతర వేస్తూ వార్తాకథనం ప్రచురించారు. 

* ఇలాంటి రాతలు రాసి మీ మీడియా హౌస్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మౌనాన్ని పిరికితనంగా భావిస్తారని, సందర్భం వచ్చినప్పుడు వాస్తవాలు తెలియజేసి, అందుకు అనుగుణంగా స్పందించాలని మహాత్మా గాంధీ చెప్పారు. అందుకే రాజకీయ ప్రయోజనాలు ఆశించి రాసిన మీ దురుద్దేశపూర్వక కథనాన్ని ఖండిస్తున్నాం.