ఆంధ్రప్రదేశ్‌లో కోడిపందాల సరదా రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. కృష్ణాజిల్లా చాట్రాయి మండలం చిత్తాపూర్‌లో తెల్లవారుజామున ఫ్లడ్‌ లైట్ల వెలుగులో కోడిపందాలు నిర్వహిస్తున్న శిబిరంపై పోలీసులు దాడి చేశారు. పోలీసులను చూసి భయపడిన కొందరు యువకులు పారిపోయే క్రమంలో పరుగులు పెట్టారు.

చీకట్లో పరిగెత్తడంతో దగ్గర్లో ఉన్న వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మరణించారు. దీంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై గ్రామస్తులు స్థానికులు మండిపడ్డారు. యువకుల మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందాలు జోరందుకున్నాయి. హైకోర్టు పందాలను నిషేధించడంతో వీటి అనుమతి నిర్వహణకు అనుమతి లేదని ఎవరైనా కోడిపందాలను నిర్వహిస్తే అరెస్ట్ చేస్తామని పోలీసులు ముందుగానే హెచ్చరించారు.