అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన ఆరోపణపై ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వివరణ ఇచ్చారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనపై చేసిన మూడు ఆరోపణలపై ఆయన వివరణ ఇచ్చారు. 

జనవరి 25వ తేదీన నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంపిన లేఖకు 26వ తేదీన తాను వివరణ ఇచ్చానని ఆనయ తెలిపారు. హైకోర్టులో స్టేటస్ కో ఉన్నందున కలెక్టర్లు, ఎస్పీల సమావేశానికి హాజరు కాలేదని ఆయన చెప్పారు. గతంలో ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం చేసిన బదిలీలు ముగిసిన అధ్యాయమని ఆయన అన్నారు. 

తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇస్తున్నానని, తప్పు ఉంటే చర్యలు తీసుకోవాలని ప్రవీణ్ ప్రకాష్ చెప్పారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కు లేఖ రాశారు. ప్రవీణ్ ప్రకాష్ మీద చర్యలు తీసుకోవాలని, ఆయనను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని సూచిస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదిత్యనాథ్ దాస్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. 

తాను నిబంధనల మేరకే వ్యవహరించానని ప్రవీణ్ ప్రకాష్ చెప్పారు. తాను ఎవరినీ నియంత్రించే ప్రయత్నం చేయలేదని స్ఫష్టం చేశారు. అఖిల భారత సర్వీసు నిబంధనల మేరకే తాను విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విశాఖ కలెక్టర్ గా ఉన్నప్పుడు చేసిన పొరపాటుకు తాను ఇచ్చిన వివరణతో కేంద్రం ఎన్నికల సంఘం సంతృప్తి చెందిందని ఆయన చెప్పారు. అధికారులు చిన్న చిన్న పొరపాట్లు చేస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్షమిస్తున్నారని ఆయన చెప్పారు. తాను వాస్తవాలు చెప్పానని, సీఎస్ ఏ విధమైన శిక్ష విధించినా అంగీకరిస్తానని ఆయన చెప్పారు.