నవరత్నాల్లో భాగంగా నిరుపేదలకు సొంతింటి కలను నిజం చేసేందుకు జగన్ సర్కార్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే రేపు విశాఖపట్నం జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టనున్నారు సీఎం జగన్. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు(గురువారం)ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించనున్నారు. నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు కట్టించే కార్యక్రమానికి వైసిపి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో జరిగే ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. సీఎం జగన్ పాల్గొనే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

గురువారం ఉదయం 9.20 గంటలకు తాడేపల్లి నుంచి ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి జగన్ బయలుదేరి 10.40 గంటలకు సబ్బవరం మండలం పైడివాడకు చేరుకుంటారు. 11.05 గంటలకు ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ఏర్పాటుచేసిన వేదిక వద్దకు చేరుకుని తన తండ్రి వైఎస్సార్‌ విగ్రహావిష్కరణ చేపట్టనున్నారు. అలాగే పార్కు ప్రారంభోత్సవం, లే అవుట్ల పరిశీలన, మోడల్‌ హౌస్‌లను లబ్ధిదారులకు అందజేయడం, పైలాన్‌ ప్రారంభోత్సవం, ల్యాండ్‌ పూలింగ్‌ కోసం భూములిచ్చిన రైతులతో ఫోటో సెషన్, తదితర కార్యక్రమాల్లో వైఎస్ జగన్ పాల్గొననున్నారు.

ముందుగా ముఖ్యమంత్రి జగన్ ప్రజలనుద్దేశించి ప్రసంగించి ఆ తర్వాత పట్టాలు, హౌసింగ్‌ స్కీమ్‌ మంజూరు పత్రాల పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.20 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని 2.25 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకోకున్నారు. ఇలా సీఎం జగన్ విశాఖ పర్యటనకు సంబంధించిన వివరాలను సీఎంవో వెల్లడించింది. 

ఇదిలావుంటే గతేడాది తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం కొమరగిరిలో ముఖ్యమంత్రి జగన్ చేతులమీదుగా ఈ ఇళ్ల పట్టాల పంపిణీ ప్రారంభమయ్యింది. రాష్ట్రంలో 31లక్షల ఇళ్ల పట్టాల పంపిణీలో పాటు 28లక్షల ఇళ్లను గూడు లేని పేదలకు నిర్మించి ఇవ్వాలని వైసిపి ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి ఈ ఇళ్లపట్టాల పంపిణీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. 

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగన్ ప్రతి పేద కుటుంబం సొంతింటి కలను నిజం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీని నెరవేర్చేందుకే ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణానికి జగన్ సర్కార్ శ్రీకారం చుట్టింది. పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణంతో కోటిమందికి పైగా ప్రజలకు మేలు జరుగుతుందని వైసిపి ప్రభుత్వం చెబుతోంది. 

ఇక నిరుపేదల ఇళ్ళకోసం ప్రభుత్వం వైఎస్సార్ జగనన్న కాలనీలను ఏర్పాటుచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1వేలకు పైగా జగనన్న కాలనీలు నిర్మించి అందులో పేదలను ఇళ్లస్థలాలు ఇవ్వాలని భావిస్తున్నారు. ఇలా కొత్తగా ఏర్పడే కాలనీల్లో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యం, పార్క్‌లు, కమ్యూనిటీ హాల్స్, విలేజ్ క్లినిక్‌లు, అంగన్ వాడీ కేంద్రాల్ని ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని ఇప్పటికే సీఎం జగన్ తెలిపారు. ఇలా సకల సౌకర్యాలతో జగనన్న కాలనీలను ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది.