Asianet News TeluguAsianet News Telugu

రాష్ట్రమంతా లాక్ డౌన్ వద్దు... అక్కడికి మాత్రమే పరిమితం చేయాలి: పీఎంతో జగన్

లాక్ డౌన్ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి పీఎం మోదీతో చర్చించారు ఏపి సీఎం జగన్. ఈ సందర్భంగా లాక్ డౌన్ పై  తన అభిప్రాయాన్ని పీఎంతో పంచుకున్నారు. 

CM YS Jagan Video Conference With PM Modi On Lockdown Extension
Author
Guntur, First Published Apr 11, 2020, 7:17 PM IST

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో కొనసాగుతున్న లాక్‌డౌన్‌పై ప్రధాని మోదీతో తన అభిప్రాయాలను పంచుకున్నారు సీఎం వైఎస్ జగన్‌. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ లో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ఆళ్లనాని, హోంమంత్రి మేకతోటి సుచరిత, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నామని...అదే సమయంలో మానవతా కోణంలో స్పందిస్తున్నామని జగన్ ప్రధానికి తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1.4 కోట్లకుపైగా ఉన్న  కుటుంబాలను, వారి ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పరిశీలిస్తున్నామని...కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వారికి పరీక్షలు చేసి వైద్యం అందిస్తున్నామన్నారు. 

''ఏపీలో 2,61,216 గ్రామ, వార్డు వాలంటీర్లు, 40వేల మంది ఆశ వర్కర్లు, 20,200 మంది ఏఎన్‌ఎంలు ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.  కోవిడ్‌ లక్షణాలు ఉన్నవారిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి వారికి దాదాపు 3వేలమంది వైద్యులు సేవలు అందిస్తున్నారు. అలాగే కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్న ప్రాంతాల్లో కంటైన్‌మెంట్‌ వ్యూహం కొనసాగుతోంది. కరోనా ఉన్న ప్రాంతాలలో  ప్రతి ఇంటిని పర్యవేక్షించడానికి, ఉద్ధృతంగా పరీక్షలు నిర్వహించడానికి, 141 కంటైన్‌మెంట్‌ క్లస్టర్లను హాట్‌స్పాట్లుగా గుర్తించాం'' అని వివరించారు. 

''ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను గణనీయంగా పెంచుతున్నాం. క్రిటికల్‌ కేర్‌ కోసం నాలుగు అత్యాధునిక ఆస్పత్రులను ఏర్పాటుచేసుకున్నాం. 13 జిల్లాల్లోని ప్రతి జిల్లాకూ ఒక కోవిడ్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేసుకున్నాం. జిల్లాల్లో వీటికి అదనంగా మరో 78 ఆస్పత్రులను ఏర్పాటు చేసుకుంటున్నాం. సమర్థవంతంగా క్వారంటైన్‌ చేయడానికి ప్రతి జిల్లాలో కోవిడ్‌ కేర్‌సెంటర్లను ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో 26వేల బెడ్స్‌ సిద్ధంగా ఉన్నాయి'' అని జగన్ ప్రధానికి తెలియజేశారు. 

''రాష్ట్రంలోని సామాన్యులపై లాక్‌డౌన్‌ ప్రభావానికి సంబంధించి కొన్ని అంశాలను మీ దృష్టికి తీసుకువస్తున్నాను. మన ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానిదే ప్రధాన భూమిక. జీఎస్‌డీపీలో 35శాతం, ఉపాధికల్పనలో 62శాతం వాటా వ్యవసాయానిదే. లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తుల రవాణా గణనీయంగా పడిపోయింది. నిలిపివేస్తారనే భయంతో 25శాతం మించి ట్రక్కులు తిరగడంలేదు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులను భద్రపరచడానికి, నిల్వచేయడానికి సరిపడా గోదాములు లేవు'' అని తెలిపారు. 

''మార్కెట్లు నడవకపోవడంతో ధాన్యం, మొక్కజొన్న, మిర్చి, పొగాకు, అరటి, బొప్పాయి, కూరగాయలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. కాని స్థానికంగా వీటిని ఎంతవరకు వినియోగించగలం? ఇప్పుడున్న పరిస్థితి కొనసాగితే లక్షలాది వ్యవసాయ కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయి. నిల్వచేయడానికి తగిన స్టోరేజీ సదుపాయం లేక ఎగుమతులు లేక ఆక్వా రంగంకూడా తీవ్రంగా దెబ్బతింటోంది'' అని రైతుల సమస్యలను పీఎం దృష్టికి తీసుకెళ్లారు. 

''ఇక రాష్ట్రంలోని పారిశ్రామిక రంగం విషయానికొస్తే... 1,03,986 యూనిట్లకుగానూ 7,250 మాత్రమే నడుస్తున్నాయి. పంపిణీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. రోడ్డు, రైల్వే రవాణాలు నిలిచిపోవడం కూడా సంక్షోభం పెరగడానికి కారణమయ్యింది. పరిశ్రమలు నడవనప్పుడు యాజమాన్యాలు జీతాలు చెల్లించగలరని మనం ఎలా ఆశించగలం? రాష్ట్రానికి ఆదాయం కూడా రాని పరిస్థితి'' వుందన్నారు.

''సహాయ కార్యక్రమాలకు, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత పరిస్థితి తలెత్తింది. లాక్‌డౌన్‌ కారణంగా వలస కార్మికులు, దినసరి కూలీలు, వ్యవసాయం, ఉద్యానవన, ఆక్వా రైతులు పూర్తిగా దెబ్బతిన్నారు. కోవిడ్‌ని–19 నివారణకు ప్రధాన మంత్రిగా మీరు తీసుకున్న విశాలమైన, గట్టి చర్యలను నేను బలంగా సమర్థిస్తున్నాను. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థ చక్రం ముందుకు కదలాలన్నది నా అభిప్రాయం'' అని తెలిపారు. 

''ఆర్థిక వ్యవస్థ చక్రం పూర్తి వేగంతో ముందుకు కదలకపోయినా కనీసం ప్రజల అవసరాలకు తగినట్టుగా నైనా నడవాలన్నది నా అభిప్రాయం. 1918లో వచ్చిన ఫ్లూ కూడా భారతదేశ ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసింది. రెండేళ్లకుపైగా అది దేశంపై ప్రభావం చూపింది. మనం దీన్ని పరిగణలోకి తీసుకుంటే... దీర్ఘకాలంలో మనం పోరాటంచేయాల్సి ఉంటుంది'' అన్నారు. 

''ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అందుబాటులో ఉన్న వివరాలను, సమాచారాన్ని పరిగణలోకి తీసుకున్ని దాన్ని విశ్లేషించి కొన్ని అంశాలను మీ ముందు ఉంచుతున్నాను. 676 మండలాలు మా రాష్ట్రంలో ఉన్నాయి. కరోనా వైరస్‌ సోకిన మండలాల్లో 37 రెడ్‌జోన్‌లో, ఆరెంజ్‌ జోన్లో 44 మండలాలు ఉన్నాయి.  ఇలా మొత్తం 81 మండలాలు రెడ్‌జోన్, ఆరెంజ్‌ జోన్‌లో ఉన్నాయి. 595 మండలాలు గ్రీన్‌జోన్లో ఉన్నాయని... ప్రస్తుతానికి కరోనా ప్రభావం వీటిపై లేదు'' అని తెలియజేశారు. 

''రెడ్‌జోన్లకే లాక్‌డౌన్‌ పరిమితం చేయాలన్నది నా అభిప్రాయం. జనం గుమిగూడకుండా మాల్స్, సినిమాహాళ్లు, ప్రార్థనా మందిరాలు, ప్రజారవాణా, పాఠశాలలపై ఇప్పుడున్న పరిస్థితి కొనసాగాలన్నది నా అభిప్రాయం. ఇవికాకుండా మిగిలిన చోట్ల భౌతిక దూరం పాటించాలన్నది నా అభిప్రాయం. కరోనా వైరస్‌ మరింత వ్యాపించకుండా దేవుడి దయవల్ల అడ్డుకోగలుగుతున్నాం'' అన్నారు.

''మన కంటికి కనిపించని ఈ మహమ్మారి త్వరలోనే నయం అవుతుందని నమ్ముతున్నాం. నా అభిప్రాయంతో పాటు మా రాష్ట్రంలో జరుగుతున్న అంశాలపై మీకు సంక్షిప్తంగా నివేదించాను. ఈ యుద్ధాన్ని ఎదుర్కోవడంలో ఒక్కటిగా ఉండాలి, ఒకే రకమైన వ్యూహంతో ముందుకు సాగాలి. మీ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం ఉంది. ప్రధానిగా మీరు సూచించే వ్యూహంతో ముందుకుసాగుతాం'' అని ప్రధానికి నివేదించారు ముఖ్యమంత్రి జగన్.  
 

Follow Us:
Download App:
  • android
  • ios