ఆంధ్రప్రదేశ్‌లో పేదవాడికి మంచి జరుగుతుంటే గత పాలకులు తట్టుకోలేకపోతున్నారని సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. గత ప్రభుత్వానికి.. ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య తేడా గమనించాలని ప్రజలను కోరారు.

బాపట్ల: ఆంధ్రప్రదేశ్‌లో పేదవాడికి మంచి జరుగుతుంటే గత పాలకులు తట్టుకోలేకపోతున్నారని సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. గత ప్రభుత్వానికి.. ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య తేడా గమనించాలని ప్రజలను కోరారు. ఎన్నికలప్పుడు మాత్రం చంద్రబాబుకు పేదలు గుర్తుకువస్తారని విమర్శించారు. గత పాలకులకు, తనకు మధ్య తేడా ఉందని.. తాను చేసిన మంచిని నమ్ముకున్నానని, ప్రజలను, దేవుడిని నమ్ముకున్నానని చెప్పారు. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పొత్తులను, ఎత్తులను, కుయుక్తులను నమ్ముకున్నారని విమర్శించారు. రాజకీయాల్లో విశ్వసనీయత ఉండాలని అన్నారు.

సీఎం జగన్ బాపట్ల జిల్లాలోని నిజాంపట్నం వేదికగా ఐదో విడత వైఎస్సార్ మత్స్యకార భరోసా నిధులను విడుదల చేశారు. బటన్ నొక్కి 1,23,519 మత్స్యకార కుటుంబాల ఖాతాల్లోకి రూ. 231 కోట్లను జమ చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మత్స్యకారులకు అరకొర సాయం అందించిందనివిమర్వించారు. చంద్రబాబు హయాంలో ఇచ్చింది కేవళం రూ. 104 కోట్లేనని.. తమ ప్రభుత్వంలో ఒక్క ఏడాదిలోనే రూ. 231 కోట్లు ఇస్తున్నామని చెప్పారు.

14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే.. ఒక్క స్కీమ్‌ కూడా గుర్తుకు రాదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోటు, మోసం, కుతంత్రాలు గుర్తుకు వస్తాయని విమర్శించారు. పేదలకు ఏ మంచి చేయని చంద్రబాబుకు ఎందుకు మద్దతిస్తారని ప్రశ్నించారు. దత్తపుత్రుడు రెండు సినిమాల మధ్య షూటింగ్ విరామంలో పొలిటికల్ మీటింగ్‌లు పెట్టేందుకు వస్తాడని విమర్శించారు. చంద్రబాబు కాల్షీట్స్ ప్రకారం వచ్చి.. స్క్రిప్ట్ ప్రకారం ప్యాకేజీ స్టార్ మాట్లాడుతాడని.. తనపై నాలుగు రాళ్లు వేసి పోతాడని విమర్శించారు. ఇలాంటి వాళ్లకు ప్రజా జీవితం అంటే ఏమిటో తెలుసా?, ప్రజలకు మంచి చేయగలరా? అని ఆలోచన చేయాలని కోరారు.

వీళ్లు అధికారం ఉంటే అమరావతి.. అధికారం పోతే హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉంటారని విమర్శించారు. అక్కడే వారి శాశ్వత నివాసం అని అన్నారు. రాష్ట్రం మీద గానీ, రాష్ట్రంలోని పేదల మీద గానీ, ప్రజల మీద గానీ వాళ్లకు ప్రేమ లేదని.. ఇక్కడ ఉండాలనే ఆలోచన కూడా లేదని విమర్శించారు. తాను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తాడేపల్లిలో ఇళ్లు కట్టించుకున్నానని చెప్పారు. అక్కడే నివాసం ఉంటున్నానని తెలిపారు. కానీ 2014 నుంచి 2019 వరకు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. అప్పుడు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ప్యాలెస్ కట్టుకున్నాడని విమర్శించారు. ప్రజలు ఈ తేడాను గమనించాలని కోరారు. 

‘‘మన రాష్ట్రంలో దోచుకోవడం.. దోచుకుంది పంచుకోవడం.. హైదరాబాద్‌లో నివాసం ఉండటమే చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడి సిద్దాంతం. చంద్రబాబు మాట్లాడితే ప్రధానులను, రాష్ట్రపతిలను తానే చేశానని కోతలు కోస్తాడని.. కానీ మన రాష్ట్రంలో 175కు 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసే సత్తా లేదు. రాష్ట్రంలోని 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తే.. ఆయన పార్టీకి రెండో స్థానం వస్తుందో? లేదో? అని భయపడుతున్నాడు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో తన పార్టీ తరఫున అభ్యర్థులను పెట్టే కెపాసిటీ కూడా లేదు. 

చంద్రబాబుకు మైదాన ప్రాంతంలో బహిరంగ సభలు పెట్టే ధైర్యం కూడా లేదు. అక్కడ మీటింగ్‌లు పెడితే కూర్చీలు ఖాళీగా ఉంటాయని.. చిన్న చిన్న సందులు, రోడ్లు వెతుక్కుంటున్నారు. అలా సభలు పెట్టి మనుషులు చనిపోతే.. కనీసం వారి పట్ల సానుభూతి కూడా చూపడం లేదు. చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ వెంటిలేటర్ మీద ఉంది. నలుగురు కలిసి లేపిన లేవలేని స్థితిలో చంద్రబాబు పార్టీ ఉంది. దత్తపుత్రుడు రెండు చోట్ల పోటీ చేస్తే.. ఎమ్మెల్యేగా వద్దని ప్రజలు తిరస్కరించారు. దత్తపుత్రుడు పార్టీ పెట్టి 10 ఏళ్లు అయినా.. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీకి పెట్టని పరిస్థితిలో ఉన్నాడు. ప్యాకేజ్ స్టార్.. ఒక్కో ఎన్నికకు ఒక్కో రేటు పెట్టి పార్టీని హోల్‌సేల్‌గా అమ్ముకుంటున్నాడు. 

ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం లేదని.. దోపిడిలో ఆయనకు రావాల్సిన వాటా వస్తే చాలని దత్తపుత్రుడు అంటున్నాడు. దత్తపుత్రుడి మాటలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. రాష్ట్రాన్ని గజ దొంగల ముఠాగా దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకోవడానికి చంద్రబాబు, దత్తపుత్రుడు, ఎల్లో మీడియా కలుస్తున్నారు. జగన్ ఎన్ని కష్టాలు వచ్చినా.. ఎన్ని అవమనాలు ఎదురైనా.. ఎన్ని వ్యవస్థలు కక్ష గట్టినా.. 15 ఏళ్లుగా ప్రజల తరఫునే నిలబడ్డాడు. నేను ప్రజలనే నమ్ముకున్నాను. మన ప్రభుత్వం చేసిన మంచినే నమ్ముకున్నాను. మీ ఇంట్లో మంచి జరిగితేనే మీ బిడ్డకు తోడుగా నిలబడండి. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను గమనించాలి’’ అని కోరారు. 

‘‘రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానిని, రాష్ట్రపతిని కలిస్తే.. కలిసిన ప్రతిసారి తనపై బురద జల్లుతున్నారు. వాస్తవంగా చూస్తే బీజేపీతో పొత్తు పెట్టుకుంది వీళ్లే.. కాంగ్రెస్‌తో అంటకాగింది వీళ్లే. అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంది వీళ్లే.. మళ్లీ వదిలేసింది వీళ్లే. వివాహం చేసుకునేది వీళ్లే.. విడాకులు ఇచ్చేది వీళ్లే.. విడాకులు ఇచ్చి మళ్లీ వివాహం చేసుకునేది వీళ్లే.. మళ్లీ మళ్లీ విడాకులు ఇచ్చేది వీళ్లే. ఇలాంటి విలువలు లేని, విశ్వసనీయత లేని రాజకీయ నాయకులు రాష్ట్రంలో కనిపిస్తున్నారు’’ అని జగన్ అన్నారు.

దత్తపుత్రుడు, దత్తతండ్రిల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని ఆరోపించారు. చంద్రబాబు ఏదంటే.. దత్తపుత్రుడు దానికి దాసోహం అంటాడని విమర్శించారు. ఏం చెప్పినా తల ఆడించడమే దత్తపుత్రుడు పనిగా పెట్టుకున్నాడని ఆరోపించారు. టీడీపీకి మంచి చేయడానికి ఏదైనా చేసేందుకు రెడీగా ఉన్నానని దత్త పుత్రుడు అంటాడని ఆరోపించారు. 

గత ఎన్నికల్లో ఓడిపోయినా తర్వాత చంద్రబాబు బీజేపీకి దగ్గర కావడం కోసం.. బీజేపీకి దగ్గర ఉండమని చెబితే దత్తపుత్రుడు చిత్తం ప్రభు అన్నాడని విమర్శించారు. చంద్రబాబు విడాకులు ఇచ్చేయమని చెబితే.. బీజేపీకి దత్తపుత్రుడు విడాకులు ఇచ్చేస్తాడని విమర్శించారు. దత్తబాబు ఇచ్చే ప్యాకేజ్‌ల కోసం దత్తపుత్రుడు ఎలాంటి వేషాలైనా వేస్తాడని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. 

చంద్రబాబు, పవన్ వ్యుహాలు బ్రహ్మాండగా ఉన్నాయని గజ దొంగల ముఠా పెద్ద పెద్ద అక్షరాలతో వాళ్ల పేపర్లలో రాస్తుందని ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే.. చంద్రబాబు విజయమని పడగ చేసుకుంటున్నారని విమర్శించారు. అయితే అక్కడ ఓడినా బీజేపీనే మళ్లీ వారితో కలిసి రావాలని అడుగుతున్నారని ఆరోపించారు. ఈ నీచ రాజకీయాలను గమనించాలని కోరారు. వీరు జగన్‌తో యుద్దం చేయడం లేదని.. జనంతో యుద్దం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఈరోజు పెత్తందార్లకు, పేదవారికి మధ్య జరిగే యుద్దం అని చెప్పారు. జగన్ పాలనకు, చంద్రబాబు పాలనకు తేడా గమనించాలని కోరారు. లంచాలు, వివక్ష లేకుండా రూ. 2.10 లక్షల కోట్లు నేరుగా ప్రజలకే అందించామని చెప్పారు.