కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ కేసులు ఊహించని విధంగా పెరిగిపోతున్నాయి. కాగా.. ఈ వైరస్ పై తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

భవిష్యత్తులో అందరికీ కరోనా సోకినా ఆశ్చర్యపోనక్కర్లేదని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. జ్వరం వచ్చినట్లే అందరికీ కరోనా కూడా సంక్రమిస్తుందని వ్యాఖ్యానించారు. ఆరు జిల్లాలకు ఆరోగ్యశ్రీ కొత్త సేవల విస్తరణ సందర్భంగా ఆయా జిల్లాల కలెక్టర్లతో జగన్ గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్లకు పలు సూచనలు చేస్తూ సీఎం జగన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్‌ వచ్చే వరకు దానితో సహజీవనం చేయాల్సిందేనని మరోసారి అన్నారు.

అయితే, కరోనా సోకిన వెంటనే ఏం చేయాలనే అంశంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. కరోనా ఉందని తెలిసిన వెంటనే ఎవరికి ఫోన్‌ చేయాలి? వైద్యం ఎలా పొందాలి అనే దానిపై అవగాహన కల్పించాలని సూచించారు. ఏపీకి ఆనుకొని ఉన్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులు తెరిచినందున రాకపోకలు పెరుగుతాయని, దీంతో కరోనా కేసులు కూడా పెరుగుతాయని తెలిపారు. ఇకపై కరోనా సంక్రమించడాన్ని ఎవరూ ఆపలేరని చెప్పారు. ప్రాథమిక జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నుంచి బయటపడొచ్చని సీఎం తెలిపారు.