ఏపీలో భారీ వర్షాలు, వరదల నేపథ్యలో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. 

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు నేపథ్యంలో వరదనీటితో నదులు, వాగులువంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండగా జలాశయాలు, ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రాజెక్టుల పరిస్థితి, నూతన ప్రాజెక్టుల నిర్మాణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష చేపట్టారు. క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పోలవరంతో సహా ఇతర ప్రాజెక్టుల పరిస్థితి గురించి అధికారులతో సీఎం చర్చించారు. 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కీలక దశలో వుండగా భారీ వర్షాలతో గోదావరి ఉప్పొంగడంతో తలెత్తిన పరిస్థితుల గురించి అధికారులు సీఎం జగన్ కు వివరించారు. పోలవరం ప్రాజెక్టులో ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యాం (ఈసీఆర్‌ఎఫ్‌) నిర్మాణ ప్రాంతంలో గతంలో ఏర్పడ్డ గ్యాప్‌–1, గ్యాప్‌–2లు పూడ్చే పనుల గురించి సీఎం అధికారులను ఆరా తీసారు. ఈ పనులను నిర్ధారించడానికి 9 రకాల టెస్టులు, నివేదికలు అవసరమని... – ఇప్పటికే కొన్ని పూర్తవగా మరికొన్ని పూర్తికావాల్సి ఉందన్నారు. ఈ క్రమంలోనే గోదావరి నదికి ముందస్తుగా వచ్చిన వరదల కారణంగా దిగువ కాఫర్‌ డ్యాం ప్రాంతంలోకి వరద నీరు చేరి టెస్టుల నిర్వహణకు ఆటంకం కలిగిందన్నారు. వరదలు తగ్గాక ఈ పరీక్షలు పూర్తిచేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. 

గోదావరి ప్రవాహం పెరగడంతో షెడ్యూలు ప్రకారం జరుగుతున్న దిగువ కాఫర్‌డ్యాం పనులకు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. గోదావరిలో వరద నీరు 2 లక్షల క్యూసెక్కులకు తగ్గితేగాని దిగువ కాఫర్‌ డ్యాం ప్రాంతంలో పనులు చేయడానికి అవకాశం వుండదన్నారు. వరదలు పూర్తిగా తగ్గితే ఆగస్టు మొదటివారంలో పనులు తిరిగి ప్రారంభించేందుకు అవకాశం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నామని అధికారులు అన్నారు. పరిస్థితులు అనుకూలంగా మారగానే ముమ్మరంగా పనులు చేయడానికి అన్నిరకాలుగా సిద్ధంకావాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. 

read more గోదావరికి పోటెత్తిన వరద: రేపటికి ధవళేశ్వరానికి 23 లక్షల క్యూసెక్కులు వచ్చే చాన్స్

ఇక ఆగస్టు మూడోవారంలో నెల్లూరు బ్యారేజీ, మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజీల ప్రారంభోత్సవానికి సిద్ధంచేశామన్న అధికారులు సీఎంకు తెలిపారు. బ్యారేజీపై పెట్టాల్సిన దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి విగ్రహం కోసం ఎదురుచూస్తున్నామని... అది కూడా త్వరలో చేరుకుంటుందని అధికారులు తెలిపారు. వచ్చే దసరా నాటికి అవుకు టన్నెల్‌–2 సిద్ధం చేయాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు. 


వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్‌-2 పనులపైనా సీఎం అధికారులతో చర్చించారు. ఏప్రిల్‌లో 387.3 మీటర్లు, మేలో 278.5 మీటర్లు, జూన్‌లో 346.6 మీటర్లు, జులైలో ఇప్పటివరకూ 137.5 మీటర్ల పనులు చేశామన్న అధికారులు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రాజెక్టును జాతికి అంకితం చేయాలని... ఆ మేరకు పనులు పూర్తిచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. 

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, మహేంద్రతనయ, తారకరామతీర్థసాగర్, గజపతినగరం బ్రాంచ్‌ కెనాల్, రాయలసీమలోని జొలదరాశి, రాజోలిబండ, కుందూ లిఫ్ట్, వేదవతి, ఆర్డీఎస్‌ ప్రాజెక్టులతో పాటు చింతలపూడి, వైయస్సార్‌ పల్నాడు, మడకశిర బైపాస్‌ కెనాల్, బైరవానితిప్ప, వరికెశెలపూడి కలుపుకుని మొత్తం 27 ప్రాజెక్టులను ప్రాధాన్యతాక్రమంలో పూర్తిచేయడానికి సీఎం ఆదేశించారు. ఈ మేరకు అధికారులకు లక్ష్యాలను నిర్దేశించారు.