Asianet News TeluguAsianet News Telugu

నూతన విద్యావిదానం వల్ల లాభాలివే... ప్రజల్లోకి తీసుకెళ్లండి: విద్యాశాఖ అధికారులకు సీఎం ఆదేశం

నూతన విద్యా విధానంపై గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ సమీక్ష నిర్వహించారు.

cm ys jagan review meeting on new education system in andhra pradesh
Author
Amaravati, First Published Jun 17, 2021, 4:30 PM IST

అమరావతి: నూతన విద్యావిధానం అమలుకోసం కార్యాచరణ రూపొందించాలని సీఎం జగన్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. రెండేళ్లలో కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని... దీనికోసం అయ్యే ఖర్చుతో వివరాలు తయారు చేయాలని ఆదేశించారు. నూతన విద్యా విధానం వల్ల ఉపాధ్యాయులకు, పిల్లలకు ఎనలేని మేలు కలుగుతుందని... ఇప్పటివారికే కాదు, తర్వాత తరాలకు విశేష ప్రయోజనం కలుగుతుందన్న సీఎం అన్నారు. 

నూతన విద్యా విధానంపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయుల్లో, ఇతర భాగస్వాముల్లో అవగాహన, చైతన్యం కలిగించాలని... తద్వారా నూతన విద్యావిధానంవల్ల జరిగే మేలును ప్రజలకు వివరించాలని సూచించారు. 

మండలానికి ఒకటి లేదా రెండు జూనియర్‌ కాలేజీలు ఉండాలని సీఎం సూచించారు. అలాగే ఆట స్థలం లేని స్కూళ్లకు నాడు–నేడు కింద భూమి కొనుగోలు చేయాలన్నారు. వచ్చే ఏడాది నుంచి విద్యా కానుకలో అదనంగా స్పోర్ట్స్‌ దుస్తులు, షూ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. 

''స్కూళ్లు, అంగన్వాడీల్లో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించడం లేదు. ఒక్క సెంటర్‌ను కూడా మూసివేయడం లేదు. ఈ రెండు అంశాలను పరిగణలోకి తీసుకునే మనం మార్పులు చేస్తున్నాం. రెండు రకాల స్కూళ్లు ఉండాలన్నది మన లక్ష్యం. పీపీ1, పీపీ2, ప్రీపరేటరీ క్లాస్, ఒకటి, రెండు తరగతులు ఒకటిగానూ ఉంటారు. వీరందరికీ కిలోమీటరు పరిధిలో స్కూలు ఉంటుంది. మిగిలిన తరగతులు అంటే.. 3 నుంచి10వ తరగతి వరకూ సమీపంలోనే ఉన్న హైస్కూల్‌ పరిధిలోకి తీసుకురావాలి. ఆ స్కూలు కూడా కేవలం 3 కి.మీ పరిధిలో ఉండాలి'' అని సీఎం సూచించారు. 

read more  సరైన సమయంలో టెన్త్, ఇంటర్ పరీక్షలపై నిర్ణయం: ఏపీ మంత్రి సురేష్

''ఉపాధ్యాయుడు, విద్యార్ధి నిష్పత్తి హేతుబద్ధంగా ఉండడం అన్నది ఈ విధానంలో ప్రధాన ఉద్దేశం. ఎక్కువ సంఖ్యలో ఉన్న పిల్లలకు ఒకరే ఉపాధ్యాయుడు ఉండడం సరికాదు. ఒకే ఉపాధ్యాయుడు అన్ని సబ్జెక్టులు బోధించే విధానం సరికాదు'' అన్నారు.

''8 సంవత్సరాలలోపు పిల్లల మానసిక వికాసం చాలా అవసరం. ఈ వయసు పిల్లల్లో నూరుశాతం మెదడు అభివృద్ధి చెందుతుంది కాబట్టి వారిలో నైపుణ్యాలను మెరుగుపర్చాలి. కాబట్టి పిల్లల సంఖ్యకు తగినట్టుగా ఉపాధ్యాయులు ఉండాలి'' అని అన్నారు. 

''ఇక 3 కిలోమీటర్ల లోపు హైస్కూల్‌ పరిధిలోకి తీసుకొచ్చే కార్యక్రమం ఎవరూ వేలెత్తి చూపేదిగా ఉండకూడదు.  అలాగే ఒకేచోట ఎక్కువ క్లాస్‌ రూంలు పెట్టడం సరికాదు. ఎన్‌ఈపీ(నేషనల్‌ ఎడ్యుకేషన్‌ ప్లాన్‌) ప్రకారం....నాణ్యమైన విద్య, నాణ్యమైన బోధన, నాణ్యతతో కూడిన మౌలిక సదుపాయాలు కల్పన మన లక్ష్యం. ఆ మేరకు పిల్లలకు విద్య అందించేదిగా మన విద్యా విధానం ఉండాలి. మనం చేస్తున్న పనులన్నీ కూడా తలెత్తుకుని చేస్తున్న పనులు. తలదించుకుని చేస్తున్న పనులు కావు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఉపాధ్యాయులుకు మంచి జరుగుతుందని చెప్పండి. పిల్లలకు కూడా మంచి జరుగుతుందని వివరించండి'' అని సీఎం తెలిపారు. 

''నూతన విద్యావిధానంలో ఒక స్కూల్‌ మూతపడ్డం లేదు. ఒక్క ఉపాద్యాయుడ్ని కూడా తీసేయడం లేదు. అంతిమంగా అదే సందేశం పోవాలి. ఇంగ్లీషు మీడియంలో చెప్పాలని ఆరాటపడుతున్నాం. పిల్లలకు మంచి విద్య అందించాలని తపన పడుతున్నాం. చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. పెద్ద ఎత్తున డబ్బులు వెచ్చిస్తున్నాం. ముందు తరాలకు మేలు జరిగేలా విద్యా వ్యవస్ధను తీర్చిదిద్దుతున్నాం. ఇదే విషయాన్ని చెప్పండి'' అని అధికారులకు సీఎం ఆదేశించారు. 

 
 
 

 

Follow Us:
Download App:
  • android
  • ios