అమరావతి: రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను సంస్కరించే దిశగా జగన్ సర్కార్ ముందుకు కదులుతోంది. ఇందుకోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు మంత్రి బొత్స సత్యనారాయణ, మున్సిపల్‌ శాఖ కార్యదర్శి శ్యామలరావు, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్ విజయకుమార్‌తో పాటు, ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులతో  సీఎం వైయస్‌ జగన్‌ సమావేశమయ్యారు. 

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల సంస్కరణలపై రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. కార్పొరేషన్లు, మున్సిపాల్టీలను స్వయం సమృద్ధి దిశగా నడిపించాలంటూ కేంద్రం చేసిన మార్గనిర్దేశాలపై చర్చించారు. 

ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల్లో ఆస్తి పన్ను విధానాలు, రాష్ట్రంలో ఆస్తి పన్ను విధానాలను అధికారులు సీఎం జగన్ కు వివరించారు. కర్ణాటక, మహారాష్ట్రల్లో అమలు చేస్తున్న ఆస్తి పన్ను విధానాలను సీఎంకు వివరించారు. ఆయా రాష్ట్రాల్లో నెలవారీ అద్దె ప్రాతిపదికన కాకుండా ఆస్తి విలువ ప్రాతిపదికన పన్నులు విధిస్తున్న అంశాన్ని అధికారులు
 వివరించారు.  

అంతేకాకుండా వివిధ రాష్ట్రాల్లో ఆస్తి విలువలు, దాని నిర్ధారించే విధానాలు, ఆ మేరకు విధిస్తున్న పన్ను తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. వాటన్నింటిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలన్న సీఎం జగన్‌ అధికారులకు ఆదేశించారు.