Asianet News Telugu

థర్డ్‌ వేవ్‌ ను ఎదుర్కొనేందుకు సిద్దం కండి..: అధికారులకు సీఎం జగన్ ఆదేశం

ఆంధ్ర ప్రదేశ్ లో మరో వారం రోజుల పాటు నైట్‌ కర్ఫ్యూ కొనసాగించాలని సీఎం జగన్ నిర్ణయించారు. దీంతో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. 

cm ys jagan review meeting on corona outbreak, vaccination in ap akp
Author
Amaravati, First Published Jul 20, 2021, 3:23 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అమరావతి: కరోనా థర్డ్‌ వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వుండాలని... మరోసారి సమర్దవంతంగా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో నిర్మించదలచిన పీడియాట్రిక్‌ సూపర్‌ కేర్‌ ఆస్పత్రుల పనులను వేగవంతం చేయాలని సూచించారు. పోలీస్‌ బెటాలియన్స్‌లో కూడా కోవిడ్‌ కేర్‌ ఎక్విప్‌మెంట్‌ ఏర్పాటుతో పాటు వైద్యులను నియమించాలని సీఎం ఆదేశించారు. 

కోవిడ్‌19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... కమ్యూనిటీ ఆస్పత్రుల స్ధాయివరకు ఆక్సిజన్‌ బెడ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పీహెచ్‌సీల్లో కూడా ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. సబ్‌సెంటర్ల వరకు టెలీమెడిసిన్‌ సేవలు, ఇంటర్‌నెట్‌ సౌకర్యం అందుబాటులో ఉండాలని... అప్పుడే వారితో పీహెచ్‌సీల వైద్యులు కూడా వీసీ ద్వారా అందుబాటులోకి వస్తారన్నారు. 

కోవిడ్‌ అంక్షల్లో భాగంగా మరో వారం రోజుల పాటు నైట్‌ కర్ఫ్యూ కొనసాగించాలని సీఎం ఆదేశించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ తప్పనిసరిగా పాటించాలని... జనసమూహాలపై ఆంక్షలు కొనసాగుతాయని సీఎం స్పష్టం చేశారు. 

ఇక వ్యాక్సినేషన్ పై సీఎం మాట్లాడుతూ... సమర్ధ నిర్వహణ ద్వారా ఎక్కుమందికి వ్యాక్సినేషన్‌ ఇవ్వగలిగామన్నారు. రాష్ట్రానికి ఇప్పటివరకు వచ్చిన వ్యాక్సిన్‌ డోసుల్లో 1,80,82,390 ఇప్పటివరకు 1,82,49,851 డోసులు ఇచ్చామన్నారు. ఇంకా (బ్యాలెన్స్‌డు డోసులు) వినియోగించాల్సిన డోసులు 8,65,500 వున్నాయని తెలిపారు. సమర్ధ నిర్వహణ ద్వారా దాదాపుగా 11 లక్షల డోసులు ఆదా చేశామన్నారు. 

read more  తూ.గోదావరిలో కరోనా జోరు: ఏపీలో మొత్తం కేసులు 19,41,724కి చేరిక

''ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులందరికీ 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయింది. విదేశాలకు వెళ్లే వారిలో ఇప్పటివరకు 31,796 మందికి వ్యాక్సినేషన్‌ ఇచ్చాం. 45 సంవత్సరాల దాటిన వారికి వ్యాక్సినేషన్‌ పూర్తయిన తర్వాత ప్రయారిటీగా ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టాలి'' అని ఆదేశించారు. 

''గడిచిన మే నెల నుంచి ప్రైవేటు ఆస్పత్రులకు కేటాయించిన వ్యాక్సిన్‌ డోసులు 35 లక్షలు కేటాయించారు. వాటిలో కేవలం సుమారు 4,63,590 డోసులు మాత్రమే వినియోగించారు. ఆ కోటాను రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించాలని కేంద్రాన్ని కోరాం'' అని తెలిపారు. 

''గర్భిణీ స్త్రీలకు వాక్సినేషన్‌ కార్యక్రమం చురుగ్గా కొనసాగాలి. వాక్సినేషన్‌పై వారికి ఆవగాహన కలిగించాలి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం వ్యాక్సినేషన్‌ పూర్తయినవారు   1,41,42,094 కాగా సింగిల్‌ డోసు పూర్తయినవారు  1,00,34,337మంది. రెండు డోసులు పూర్తయినవారు  41,07,757మంది'' అని సీఎం జగన్ వెల్లడించారు.

ఈ సమీక్షా సమావేశంలో ఉపముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌(నాని), సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, స్టేట్‌ కోవిడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనిజిమెంట్‌ అండ్‌ వాక్సినేషన్‌) ఎం రవిచంద్ర, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం టీ కృష్ణబాబు,  ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి(హెచ్‌ఆర్‌) శశిభూషణ్‌ కుమార్, 104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జి ఎ బాబు, ఆరోగ్య కుటుంబసంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్‌ ఎ మల్లిఖార్జున్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
 

 

Follow Us:
Download App:
  • android
  • ios