ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌ రెడ్డి‌లతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు, టిడ్కో ఇళ్లపై సమీక్ష చేపట్టారు. 

టిడ్కో ఇళ్ల మీద జరుగుతున్న అసత్య ప్రచారం జరుగుతుందని.. ఆ విష ప్రచారం అంతా ఇంత కాదని అన్నారు. ఆ విష ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సూచించారు. టీడీపీ హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిగా పక్కన బెట్టిందని అన్నారు. ఒక్క లబ్ధిదారునికి కూడా ఇళ్లు ఇవ్వలేకపోయిందని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లను పూర్తి చేస్తున్నామని అన్నారు. టిడ్కో ఇళ్లను పూర్తి చేసి మంచి మౌలిక సదుపాయాలుతో లబ్ధిదారులకు అప్పగిస్తున్నామని చెప్పారు. ఈ వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని అధికారులను ఆదేశించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో, ప్రస్తుత ప్రభుత్వంలో జరిగిన పనులు వివరాలను అధికారులు ఈ సందర్బంగా సీఎం జగన్‌కు వివరించారు. 

2022–23 ఆర్థిక సంవత్సరంలో హౌసింగ్ కోసం రూ.10,203 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే.. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.15,810 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామ‌ని అధికారులు సీఎం జగన్‌కు వివ‌రించారు. ఇప్పటివరకూ 3,40,741 ఇళ్లు పూర్తయ్యాయన్నారు. శ్లాబ్‌ పూర్తి చేసుకున్నవి, శ్లాబుకు సిద్ధంచేసినవి.. 4,67,551 ఇళ్లు ఉన్నాయని చెప్పారు. ఇవి కొన్నిరోజుల్లో పూర్తవుతాయని చెప్పారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. 

ఇళ్ల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడవద్దని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలపై సీఎం జగన్ సమీక్షించారు. కరెంటు, తాగునీరు సహా మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్న ఈ సందర్భంగా అధికారులు సీఎం జగన్‌కు తెలియజేశారు. జగనన్న కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థపై దృష్టిపెట్టాలన్న సీఎం జగన్ అధికారులకు సూచించారు. ప్రతి ఇంటికీ కూడా సోక్పిట్స్‌ ఏర్పాటు చేస్తున్నామన్న అధికారులు తెలిపారు. భవిష్యత్తులో వాననీటిని భూమిలోకి ఇంకించేలా చేయడానికి ఇవి ఉపయోగడతాయని చెప్పారు.