ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు వైఎస్సార్ లా నేస్తం నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాలుగా వైఎస్సార్ లా నేస్తం అమలు చేస్తున్నామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు వైఎస్సార్ లా నేస్తం నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాలుగా వైఎస్సార్ లా నేస్తం అమలు చేస్తున్నామని చెప్పారు. 2,677 మంది జూనియర్ అడ్వకేట్స్‌కు రూ. 6.12 కోట్లను వారి ఖాతాల్లో జమచేస్తున్నామని తెలిపారు. లా కోర్సు పూర్తిచేసినవారు మొదటి మూడు సంవత్సరాల్లో ప్రాక్టీసు పరంగా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్న సీఎం జగన్.. వారికి తోడుగా నిలిచేందుకు వైఎస్సార్ లా నేస్తం తీసుకొచ్చినట్టుగా చెప్పారు.
వారికి ప్రతి నెలా రూ.5వేల చొప్పిన ఏడాదిలో రూ.60వేలు ఇస్తున్నామని చెప్పారు. మూడేళ్లలో ఇలా ఒక్కొక్కరికీ రూ.1.8లక్షలు ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటవరకూ 5,781 మందికి మేలు చేశామని.. మొత్తంగా 41.52కోట్లు జూనియర్ లాయర్లకు ఇచ్చామని చెప్పారు. ఇలాంటి పథకం, ఇలాంటి ఆలోచన దేశంలో ఏ రాష్ట్రంలో లేదని సీఎం జగన్ అన్నారు. కేవలం ఏపీలో మాత్రమే ఇలాంటి పథకాన్ని చూస్తున్నారని చెప్పారు. అన్నిరకాలుగా మంచి జరగాలనే ఉద్దేశంతో రూ.100 కోట్లతో ఇప్పటికే వెల్ఫేర్ ట్రస్టును పెట్టడం జరిగిందని గుర్తుచేశారు. అడ్వొకేట్లకు రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుందని చెప్పారు.
ఇక, వైఎస్సార్ లా నేస్తం.. కెరీర్ ప్రారంభించిన జూనియర్ అడ్వకేట్‌లు తమ వృత్తిలో స్థిరపడే వరకు వారికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఏటా రూ. 60 వేలు రెండు విడతలుగా జమ చేయడం ద్వారా మూడేళ్లపాటు రూ.1.80 లక్షల స్టైఫండ్‌ను వారికి అందజేస్తోంది. ఈ పథకం కింద ప్రభుత్వం గత నాలుగేళ్లలో 5,781 మంది లబ్ధిదారులకు రూ. 41.52 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందజేసిందని.. ఇందులో ప్రస్తుత ఆర్థిక సాయం కూడా ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
