అమరావతి: అనారోగ్యంతో బాధపడుతున్న ఎంఐఎం పార్టీ శాసనసభాపక్ష నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. 

అక్బరుద్దీన్ ఓవైసీ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షిస్తూ జగన్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు అక్బరుద్దీన్ ఓవైసీ. 

తీవ్ర అనారోగ్యం పాలైన ఆయన లండన్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే మూడురోజుల క్రితం అక్బరుద్దీన్ తిరిగి ఆకస్మాత్తుగా వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పికి గురవ్వడంతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. 

ఈ నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. ఇకపోతే అక్బరుద్దీన్ ఓవైసీ కుటుంబానికి వైయస్ జగన్ కుటుంబానికి మంచి స్నేహ సంబంధం ఉంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసేందుకు ప్రయత్నించారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. అయితే రాజకీయ పరిణమాల నేపథ్యంలో ఆయన ప్రచారాన్ని విరమించుకున్న సంగతి తెలిసిందే.