వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయిచేసుకున్నట్లుగా వార్త కృష్ణా జిల్లా పొలిటికల్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సోషల్ మీడియా ప్రచారంపై ఎమ్మెల్యే కూడా స్పందించారు.
మైలవరం: సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లుకొడుతున్న ఓ పోస్ట్ కృష్ణా జిల్లా (krishna district)లోనే కాకుండా ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (ysrcp)కి చెందిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ (vasanta krishna prasad) ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan) చేయిచేసుకున్నారంటూ జరుగుతున్న ప్రచారం రాజకీయంగా దుమారం రేపింది. కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. జిల్లాకు చెందిన ఏ ఇద్దరు రాజకీయ నాయకులు ఎదురుపడినా దీనిపైనే చర్చించుకుంటున్నారు.
ఈ వివాదాస్పద సోషల్ మీడియా పోస్ట్ పై ఎమ్మెల్యే కృష్షప్రసాద్ స్పందించారు. వైసిపి పార్టీని పొలిటికల్ గా ఎదుర్కోలేకే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఈ తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో రంగంలోకి దిగిన మైలవరం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ సోషల్ మీడియా పోస్ట్ పై సాంకేతికత సాయంతో విచారణ జరిపిన పోలీసులకు తెలంగాణలో మూలాలున్నట్లు తెలిసింది. ఏపీకి సరిహద్దు జిల్లా ఖమ్మంలో మొదట ఈ పోస్ట్ పెట్టినట్లు... జిల్లాకు చెందిన ఓ తెలుగు యువత కీలక నాయకుడి ప్రమేయం వున్నట్లు అనుమానిస్తున్నారు.
పోలీసులు అనుమానిస్తున్న తెలుగు యువత నాయకుడు ప్రస్తుతం పరారీలో వున్నాడు. దీంతో అతడిపై అనుమానం మరింత బలపడుతోంది. త్వరలోనే సదరు టిడిపి యూత్ నాయకున్ని పట్టుకుని విచారిస్తామని పోలీసులు తెలిపారు.
తనకు ముఖ్యమంత్రి జగన్ తో ఎలాంటి విబేధాలు లేవని... అలాంటిది ఆయన తనను ఎందుకు కొడతాడని కృష్ణ ప్రసాద్ ప్రశ్నించారు. తనపై కుట్రపూరితంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని... ఇలాంటి ప్రచారాలను ప్రజలు, వైసిపి శ్రేణులు నమ్మవద్దని కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.
