ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం పౌరసరఫరాలశాఖ కొత్త వాహనాలను ప్రారంభించారు.  ఈ ఉదయం కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన 2,500 రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాలను విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. 

"

మిగిలిన జిల్లాలకు కేటాయించిన వాహనాలను మంత్రులు ప్రారంభిస్తారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,260 వాహానాలు ప్రారంభంకానున్నాయి. ఫిబ్రవరి 1వతేదీ నుంచి నాణ్యమైన రేషన్‌ బియ్యం డోర్‌ డెలివరీ కోసం ఈ వాహనాలు సిద్ధమయ్యాయి. 

లబ్ధిదారులకు నాణ్యమైన, మెరుగుపరచిన బియ్యాన్ని ఇంటివద్దే అందచేసేందుకు ఏటా రూ.830 కోట్లు అదనంగా వెచ్చిస్తూ పథకాన్ని రూపొందించారు.

రేషన్‌ డెలివరీ కోసం ప్రవేశపెట్టిన వాహనాలను కడప జిల్లాలో ఇన్‌ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్‌, డిప్యూటీ సీఎం ఆంజాద్‌బాషా ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 514 వాహనాలు ఇంటకే రేషన్‌ సరుకులు అందజేయడానికి సిద్ధంగా ఉన్నాయి.  శ్రీకాకుళంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ ఈ వాహనాలను ప్రారంభించారు. 

దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటికే రేషన్‌ సరుకులు డెలివరీ చేసేందుకు గాను ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 9,260 వాహనాలను ఉపయోగించనుంది. ఈ వాహనాల కోసం ప్రభుత్వం రూ.539 కోట్లు ఖర్చు చేసింది. ఫిబ్రవరి 1నుంచి ఇంటికే రేషన్‌ విధానం ప్రారంభం కానుంది.

రేషన్‌ సరుకులు ఇంటికి డోర్‌ డెలివరీ చేసే క్రమంలో కల్తీ జరగడానికి ఎలాంటి ఆస్కారం లేకుండా అధికారులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ప్రతీ బియ్యం బస్తాకు సీల్‌తోపాటు యూనిక్‌ కోడ్‌ ద్వారా ఆన్‌లైన్‌ ట్రాకింగ్‌ ఏర్పాటు చేయనున్నారు.