అమరావతి: బక్రీద్ పండగ సందర్భంగా రాష్ట్రంలోని ముస్లీం సోదరులకు గవర్నర్ బిస్వభూషన్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.  

ముస్లిం సోదరులకు, సోదరీమణులకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బక్రీద్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగం, భక్తి, విశ్వాసానికి ఈ పండుగ ప్రతీక అని అన్నారు దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లింలు చేసుకునే ఈ పండుగ భక్తి భావానికి, త్యాగానికి చిహ్నమని అన్నారు. పేదల పట్ల జాలి, దయ కలిగి ఉండటమే బక్రీద్‌ ఇచ్చే సందేశమన్నారు.  బక్రీద్‌ను ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆకాంక్షించారు.

గవర్నర్ బిస్వభూషన్ హరిచందన్ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ''బక్రిద్ (ఇద్-ఉల్-జుహా) పవిత్ర దినం సందర్భంగా  ఆంధ్రప్రదేశ్‌లోని ముస్లిం సోదరులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బక్రిద్ పవిత్రమైన దినంగా ఇస్లామ్ మతంలో ఎంతో ప్రాముఖ్యతను కలిగిన రోజు. ముస్లిం సోదరులు ఈ పండుగను సంపూర్ణ భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. బక్రిద్ పండుగ త్యాగనిరతి, దేవుని పట్ల సంపూర్ణ భక్తి భావం మరియు పేదల పట్ల కరుణను సూచిస్తుంది. ఇతరుల పట్ల సోదర భావాన్ని తెలియచేస్తుంది. ఈ పవిత్రమైన రోజును ముస్లిం సోదరులు దానధర్మాలు, సద్భావనలతో ఆచరిస్తారు" అంటూ గవర్నర్ పేరిట రాజ్ భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. 

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లీంలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పండుగనును జరుపుకుంటారన్నారు. భక్తి భావం,  కరుణ, సహనాన్ని బక్రీద్ చాటి చెబుతుందన్నారు. త్యాగానికి ప్రతీకగా ఈ బక్రీద్ పండుగను జరుపుకుంటారన్నారు. మహ్మద్ ప్రవక్త బోధనలు, విధానాలు అందరికీ అనుసరణీమైనవని తెలిపారు. బక్రిద్ దేవుని పట్ల సంపూర్ణ భక్తి భావం, పేదల పట్ల సాయం, ఇతరుల పట్ల సోదర భావాన్ని పెంపొందిస్తుందని చంద్రబాబు తెలియజేశారు.