కడప: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన సొంత జిల్లాలో రెండురోజుల పాటు పర్యటించనున్నారు. ఆయన పర్యటన అధికారికంగా ఖరారయ్యింది. జూన్ 7, 8వ తేదీల్లో జగన్ కడప జిల్లాలో వివిధ అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అయితే సీఎం పర్యటనకు వెళ్ళే అధికారులకు, పాత్రికేయులకు కరోనా టెస్టులు నిర్వహించనున్నారు. ఈ టెస్ట్ లో నెగిటివ్ వస్తేనే పర్యటనకు అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు. 

సీఎం జగన్ కడప పర్యటన వివరాలు...

 జూన్ 7వ తేదీ సాయంత్రం సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి కడప విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో ఇడుపులపాయకు చేరుకొని రాత్రి అక్కడే అతిథి గృహంలో బసచేయనున్నారు.

 8వ తేదీ ఉదయం వైఎస్సార్ ఘాట్ కు చేరుకోని కుటుంబ సభ్యులతో కలిసి దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళి అర్పించనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ట్రిబుల్ ఐటీకి చేరుకోనున్నారు సీఎం జగన్.  ఇక్కడ  పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అకాడమీ కాంప్లెక్స్ భవనాన్ని ప్రారంభించనున్నారు. అలాగే సోలార్ పవర్ ప్రాజెక్టుకు పునాది రాయి వేయనున్నారు. 

ఈ కార్యక్రమాల తర్వాత మళ్లీ ఇడుపులపాయ అతిథి గృహానికి చేరుకోని అరగంట పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. తదనంతరం కడప ఎయిర్ పోర్టుకు చేరుకోని తిరిగి గన్నవరం బయలుదేరనున్నారు. ఈ మేరకు సీఎం  అధికారికంగా పర్యటన ఖరారు కావడంతో జిల్లా అధికార యత్రాంగం ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. 

ఆరు నెలల తర్వాత సీఎం స్వంత జిల్లాకు రానుండటంతో పటిష్టమైన చర్యలు చేపట్టారు అధికారులు. కోవిడ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సీఎం పర్యటనకు పరిమిత సంఖ్యలోనే ప్రజలను అనుమతించనున్నారు. జనం గుమి గూడకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది జిల్లా యంత్రాంగం.