జాబ్ కాలెండర్ ను విడుదల చేయనున్న ఏపీ సీఎం జగన్
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నాడు జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయనున్నారు
అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నాడు జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయనున్నారు. ఈ ఏడాది 10,143 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకొంది. వచ్చే నెల నుండి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో జాబ్ కేలండర్ ను విడుదల చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీల్లో 95 శాతం అమలు చేసినట్టుగా జగన్ ప్రకటించారు.
విద్య, వైద్యం, పోలీసు శాఖల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనుంది. ఏపీపీఎస్సీ, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, డీఎస్సీ తదితర నియామక సంస్థల ద్వారా నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. గ్రూప్–1, గ్రూప్–2తో సహా అన్ని ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూలను రద్దు చేయాలని నిర్ణయించారు. రాత పరీక్షల్లో అభ్యర్థులు సాధించే మెరిట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ఎస్సీ, ఎస్టీకి చెందిన 1238 బ్యాక్ లాగ్ పోస్టులు,ఎపీపీఎస్సీసీ గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులు 36, పోలీస్ శాఖలో 450, వైద్యలు, అసిస్టెంట్ ప్రోఫెసర్లు 451 పోస్టులను భర్తీ చేయనున్నారు. 5251 పారామెడికల్ మందిని భర్తీ చేయనున్నారు. 441 నర్సులు, 240 డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, రెండు వేల అసిస్టెంట్ ప్రోఫెసర్ల పోస్టులతో పాటు ఇతర శాఖల్లో 36 పోస్టులను భర్తీ చేయనుంది ఏపీ సర్కార్.