గతంలో ఏ ప్రభుత్వం నేతన్నకు అండగా నిలవలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ అన్నారు. మగ్గం ఉన్న ప్రతి నేతన్న కుటుంబానికి ఏడాదికి రూ. 24 వేలు సాయం అందజేస్తున్నామని చెప్పారు.

గతంలో ఏ ప్రభుత్వం నేతన్నకు అండగా నిలవలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ అన్నారు. మగ్గం ఉన్న ప్రతి నేతన్న కుటుంబానికి ఏడాదికి రూ. 24 వేలు సాయం అందజేస్తున్నామని చెప్పారు. నేతన్నల కష్టాలను తన పాదయాత్రలో గమనించినట్టుగా చెప్పారు. సీఎం జగన్ గురువారం కృష్ణా జిల్లాలోని పెడనలో వైఎస్సార్ నేతన్న నేస్తం నాలుగో విడుత నిధుల పంపిణీ కార్యక్రమం‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. 80,546 మంది నేతన్నలకు రూ. 193.31 కోట్లు జమ చేస్తున్నట్టుగా చెప్పారు. ఇప్పటివరకు నేతన్న సంక్షేమం కోసం రూ. 2,049.2 కోట్లు వెచ్చించినట్టుగా తెలిపారు. ఈ నాలుగేళ్లలో ప్రతి కుటుంబానికి ఏడాది రూ.24 వేల చొప్పున.. ఇప్పటిదాకా రూ.96 వేలు సాయం అందించామని తెలిపారు. అవినీతికి తావులేకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నట్టుగా చెప్పారు.

చేనేతలతో పాటు అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్నామని చెప్పారు. చంద్రబాబు హయంలో ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం జరిగిందని విమర్శించారు. వైసీపీ పాలనలో 50 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించామని చెప్పారు. సామాజిక న్యాయ చరిత్రలో ఇదో కొత్త అధ్యాయం అని అన్నారు. ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి, దత్తపుత్రుడి కోసమే గత ముఖ్యమంత్రి చంద్రబాబు పని చేశారని, గతంలో దోచుకో, తినుకో, పంచుకో పథకం నడిచిందని విమర్శించారు. ప్రజలకు మంచి జరుగుతుంటే జీర్ణించుకోలేని కొందరు కుట్రదారులు ఉన్నారని మండిపడ్డారు. వాళ్లు తప్పుడు విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు.

కాసేపటి కితం శుభవార్త వచ్చిందని సీఎం జగన్ చెప్పారు. మచిలీపట్నం పోర్టుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. పోర్టుకు కోర్టు అనుమతివ్వడం శుభపరిణామం అని చెప్పారు. త్వరలోనే మచిలీపట్నం పోర్టుకు శంకుస్థాపన చేయనున్నట్టుగా తెలిపారు. ఇక, సభలో మాట్లాడిన అనంతరం బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు.