నెల్లూరు జిల్లా గొలగమూడి వీపీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరుగుతున్న దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి సంస్మరణ సభకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరయ్యారు. గౌతమ్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంస్మరణ సభలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా గొలగమూడి వీపీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరుగుతున్న సంస్మరణ సభకు హాజరైన సీఎం జగన్.. గౌతమ్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులు, అభిమానులు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. గౌతమ్‌రెడ్డి మృతికి సంతాపంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా గౌతమ్‌రెడ్డి కుటుంబ సభ్యులను సీఎం వైయస్‌ జగన్‌ ఓదార్చారు. 

ఈ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. గౌతమ్ రెడ్డి లేరన్న విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని చెప్పారు. చిన్నప్పటి నుంచి గౌతమ్ రెడ్డితో పరిచయం ఉందని గుర్తుచేసుకున్నారు. ప్రతి అడుగులోనూ గౌతమ్‌రెడ్డి నాకు తోడుగా ఉన్నారు. గౌతమ్ రెడ్డి లాంటి మంచి వ్యక్తిని పోగొట్టుకున్నందుకు బాధగా ఉందన్నారు. గౌతమ్ రెడ్డితో సాన్నిహిత్యం చెప్పలేనిదన్నారు. పరిశ్రమల శాఖ సహా 6 శాఖలను గౌతమ్ రెడ్డి నిర్వహించారని గుర్తుచేసుకున్నారు. చివరి క్షణం వరకు రాష్ట్రాభివృద్ది కోసం గౌతమ్ రెడ్డి శ్రమించారని తెలిపారు.

మంచి మంత్రిగా, ఎమ్మెల్యేగా, స్నేహితుడిగా గౌతమ్ రెడ్డి నిలిచారని సీఎం జగన్ చెప్పారు. గౌతమ్ రెడ్డి కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. గౌతమ్ రెడ్డి గురించి ఎంత చెప్పినా ఆ లోటును భర్తీ చేయలేమని అన్నారు. గౌతమ్ రెడ్డి పేరు చిరస్థాయిగా ఉండేలా కార్యక్రమం చేపడతామని తెలిపారు. మే 15 లోగా సంగం బ్యారేజ్ పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు. సంగం బ్యారేజికి మేకపాటి గౌతమ్ సంగం బ్యారేజ్‌గా నామకరణం చేస్తున్నట్టుగా చెప్పారు. 

అంతకుముందు సీఎం జగన్ సోమవారం ఉదయం.. గన్నవరం ఎయిర్‌ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌‌లో నెల్లూరు పోలీసు కవాతు మైదానంలోని హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వీపీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకున్నారు.

గౌతమ్‌రెడ్డి సంతాప సభ ముగిసిన అనంతరం సీఎం జగన్.. హెలికాప్టర్‌లో రేణిగుంటకు బయలుదేరి వెళుతారు. రేణిగుంటకు చేరుకుని ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్లనున్నారు. సీఎం జగన్ నెల్లూరు జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసు యంత్రాగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.