అమరావతి: హ్యపీ నెస్ట్‌ బిల్డింగులను పూర్తిచేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. అమరావతి మెట్రోపాలిటిన్‌ ఏరియా డెవలప్‌ అథారిటీపై సీఎం జగన్‌ గురువారం నాడు సమీక్ష నిర్వహించారు. 

అమరావతిలో ప్రస్తుతం నిర్మాణాలు ఏయే దశల్లో నిర్మాణాలు ఉన్నాయనే విషయాన్ని సీఎం అధికారులను అడిగారు. ఈ నిర్మాణాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నిధుల సమీకరణకు ప్రణాళిక సిద్దం చేసుకోవాలని ఆయన అధికారులను కోరారు.ఆర్ధిక శాఖాధికారులతో చర్చించి  నిధులను సమీకరణకు ప్లాన్ చేయాల్సిందిగా కోరారు. 

ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ, ఏఎంఆర్డీఏ కమిషనర్ లక్ష్మీ నరసింహం,తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో మూడు రాజధానులకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అమరావతి రానున్న రోజుల్లో శాసన రాజధానికే పరిమితం కానుంది. దీంతో అమరావతి శాసన రాజధాని కోసం భవనాలను నిర్మించనున్నారు.

గత నెలలో అమరావతిలో భవనాల నిర్మాణ స్థితిగతులను మంత్రి బొత్స సత్యనారాయణ పరిశీలించారు. ఏయే దశల్లో ఉన్నాయో ఆయన అధికారులను అడిగి తెలుసుకొన్నారు. భవనాల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.