ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బంధువు, పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలం వైసీపీ ఇన్ చార్జ్ ఉన్న వైఎస్ కొండారెడ్డికి బెయిల్ మంజూరు అయింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బంధువు, పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలం వైసీపీ ఇన్ చార్జ్ ఉన్న వైఎస్ కొండారెడ్డికి బెయిల్ మంజూరు అయింది. ఎస్‌ఆర్‌కే కన్‌స్ట్రక్షన్ కాంట్రాక్ట‌ర్ల‌‌ను బెదిరించిన కేసులో పోలీసులు ఆయనను రెండు రోజుల క్రితం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అరెస్ట్ అనంతరం ఆయనను లక్కిరెడ్డి పల్లె కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. అయితే వైఎస్ కొండా రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోగా.. లక్కిరెడ్డి పల్లె కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన రాయచోటి సబ్‌ జైలు నుంచి విడుదలయ్యారు. 

ఇక, ఈ కేసుకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే.. కర్ణాటకు చెందిన కాంట్రాక్టు ఏజెన్సీ ఎస్‌ఆర్‌కే కన్‌స్ట్రక్షన్స్ ఫిర్యాదు మేరకు సోమవారం వైఎస్ కొండా రెడ్డిని అరెస్టు చేసినట్లు కడప ఎస్పీ అన్బురాజన్ మీడియాకు వెల్లడించారు. కాంట్రాక్ట్ సంస్థ కడప జిల్లా వేంపల్లి-రాయచోటి రహదారి నిర్మాణానికి టెండర్లు దక్కించుకుందని.. గత కొన్ని నెలలుగా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. 

‘‘ఓ వ్యక్తి తాను చెప్పినట్టుగా వినకుంటే ఆగిపోతాయని భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఎస్‌ఆర్‌కే కన్‌స్ట్రక్షన్స్ ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు మేరకు మేము ప్రాథమిక విచారణ చేశాం. కాల్ చేసింది కొండా రెడ్డి అని మాకు తెలిసింది. దీంతో విచారణ జరిపి అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచాం. కోర్టు రిమాండ్ విధించింది. ఎవరూ అవినీతికి పాల్పడినా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది’’ అన్బురాజన్ చెప్పారు.