Asianet News TeluguAsianet News Telugu

సీఎం జగన్ మహా నటుడు.. ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువే - నాగబాబు

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి మహానటుడు అని జనసేన నాయకుడు, సినీ నటుడు నాగబాబు అన్నారు. ప్రస్తుత రాజ్యాంగంలో రీకాల్ అనే హక్కు ఉంటే వైసీపీ ప్రభుత్వాన్ని మొదటి ఏడాదిలోనే ప్రజలు ఇంటికి పంపించేవారని తెలిపారు. తండ్రి చేసిన మంచి పనులు చూసి గెలిపిస్తే.. ఏపీని బిర్యానీ ప్లేట్ చేసి మింగేస్తున్నాడని ఆరోపించారు.

CM Jagan is a great actor.. Oscar award is less - Nagababu..ISR
Author
First Published Feb 11, 2024, 7:08 AM IST | Last Updated Feb 11, 2024, 7:08 AM IST

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జనసేన ప్రధాన కార్యదర్శి, సినీ నటుడు నాగబాబు విమర్శలు చేశారు. జగన్ మోహన్ రెడ్డి అద్భుతమైన నటుడు అని, ఆయనలా నటించడం భూ ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాదని అన్నారు. మొహం అమాయకంగా పెట్టి చేసిన నటనకు ఆస్కార్ అవార్డు ఇచ్చిన కూడా తక్కువే అవుతుందని ఎద్దేవా చేశారు. అధికారంలోకి రాక ముందు పార్టీ లోగోలో వైఎస్ఆర్ ఫోటోను పెట్టారని, తరువాత దానిని తీసేశారని అన్నారు. అనకాపల్లి నియోజకవర్గ నాయకులతో నిర్వహించిన సమావేశంలో నాగబాబు ఈ కామెంట్స్ చేశారు. 

ఆస్తుల కోసం తల్లి, చెల్లిని కూడా స్వార్థంతో జగన్ మోహన్ రెడ్డి దూరం పెట్టాడని, ఆయన ప్రజలకు ఏం మేలు చేస్తారని నాగబాబు ప్రశ్నించారు. వైసీపీకి అనుకూలంగా వచ్చిన సర్వేలు మాత్రమే నిజమైనవిగా, మిగిలినవి ఫేక్ సర్వేలుగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని, అది వారి అమాయకత్వానికి నిదర్శనమని తెలిపారు. జనసేన- తెలుగుదేశం కూటమిదే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అని ధీమా వ్యక్తం చేశారు. ‘‘సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టాక ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల, కేంద్రంలో బలమైన బీజేపీ ప్రభుత్వం ఉండటం వల్ల ఇలాగైనా బతుకుతున్నాం. లేకపోతే వైసీపీ అరాచకాలకు ఎప్పుడో బలైపోయేవాళ్లం. అక్రమాస్తుల కేసులో 16 నెలలు జగన్ జైల్లో ఉండి వచ్చాడు. తండ్రి చేసిన మంచి పనులు చూసి గెలిపిస్తే.. ఏపీని బిర్యానీ ప్లేట్ చేసి మింగేస్తున్నాడు.’’ అని నాగబాబు ఆరోపించారు. 

‘‘మన రాజ్యాంగంలో రీ కాల్ అనే హక్కు లేదు కాబట్టి వైసీపీ బతికిపోయింది. లేకపోతే అధికారం వచ్చిన తొలి ఏడాదిలోనే ఆ పార్టీని ప్రజలు ఇంటికి పంపించేవారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీని మూసివేసి రైతులు, కార్మికులను రోడ్డు పాలుజేశాడు. ఆసియాలో బెల్లం ఎగుమతులకు అనకాపల్లి ఫేమస్. తిరుపతి ప్రసాదాల్లో కూడా అనకాపల్లి బెల్లం వాడేవారని గర్వంగా చెప్పుకునే వాళ్లం. ఇప్పుడు తిరుపతికి బెల్లం ఎగుమతులను నిలిపివేసి రైతుల పొట్ట కొట్టారు.’’ అని నాగబాబు విమర్శించారు. 

ఐ.టి. మంత్రిగా ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఏపీకి తన హాయంలో ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారో చెప్పాలని నాగబాబు ప్రశ్నించారు. ఎంతమంది యువతకు ఉద్యోగాలు ఇప్పించారో చూపించాలని అన్నారు. విశాఖ గ్లోబల్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చాయని, ఎంత మందికి ఉద్యోగం, ఉపాధి  అందించారో జవాబు ఇవ్వాలని తెలిపారు. గంజాయి స్మగ్లింగ్ లో 80 శాతం కమీషన్లు తీసుకుంటారని స్థానిక మంత్రిపై ఆరోపణలు ఉన్నాయని నాగబాబు అన్నారు. జనసేన- టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నాణ్యమైన విద్యా, వైద్యాన్ని ఉచితంగా అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రతీ నియోజకవర్గంలోని 500 మంది యువతను వ్యాపారవేత్తలుగా మారుస్తామని, లా అండ్ అర్డర్ కఠినంగా అమలు చేస్తామని తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios