Asianet News TeluguAsianet News Telugu

జీఎస్ పీసీ బాధిత మత్స్యకారులకు రూ.80 కోట్లు.. సీఎం జగన్ నిర్ణయం

పరిహారం కోసం అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రుల చుట్టూ మత్స్యకారులు పలుమార్లు ప్రదక్షిణలు చేసినా  పట్టించుకోలేదు. తమ సమస్యను పరిష్కరించాలని గాడిమొగలో జీఎస్‌పీసీ గేటు వద్ద మత్స్యకారులు 103 రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్షలు చేశారు. 

CM Jagan decision on  GSPC drilling:  16,654 fishermen to get Rs 80 crore
Author
Hyderabad, First Published Nov 20, 2019, 2:35 PM IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కి తాము జీవితాంతం రుణపడి ఉంటామని మత్స్యకారులు  చెబుతున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి.. జీఎస్‌పీసీ బాధిత మత్స్యకారులకు ఈ నెల 21న పరిహారం ఇచ్చేందుకు  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ రంగం సిద్ధం చేశారు. మోడువారిన తమ జీవితాల్లోకి నవవసంతం తీసుకువచ్చిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు తాము జీవితాంతం బుుణపడి ఉంటామని మత్స్యకారులు ఆనందంగా చెబుతున్నారు.  

తాళ్లరేవు మండలం మల్లవరంలోని గుజరాత్‌ స్టేట్‌ పెట్రోలియం కార్పొరేషన్‌  చమురు, సహజవాయువు అన్వేషణకు సముద్రంలో డ్రిల్లింగ్‌ ప్రారంభించిన నేపథ్యంలో.. ముమ్మిడివరం, రామచంద్రపురం నియోజకవర్గాల పరిధిలోని 16,654 మత్స్యకార కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డాయి. వారికి రూ.81 కోట్ల నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంది. 

పరిహారం కోసం అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రుల చుట్టూ మత్స్యకారులు పలుమార్లు ప్రదక్షిణలు చేసినా  పట్టించుకోలేదు. తమ సమస్యను పరిష్కరించాలని గాడిమొగలో జీఎస్‌పీసీ గేటు వద్ద మత్స్యకారులు 103 రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్షలు చేశారు. సుమారు 5 వేల బోట్లపై వేలాది మంది మత్స్యకారులు ప్రాణాలకు తెగించి సముద్రంలో చమురు సంస్థల పనులను అడ్డుకున్నారు. అయినప్పటికీ వారిపై నాటి చంద్రబాబు సర్కార్‌ ఏమాత్రం సానుభూతి చూపలేదు.

రోజులు గడిచాయి... అధికారంలోకి రాగానే ఈ సమస్య పరిష్కరిస్తానని నాడు ప్రతిపక్షనేతగా ఉన్న వైయస్‌ జగన్‌ మాట ఇచ్చారు. వాస్తవానికి జీఎస్‌పీసీ ద్వారా పరిహారం అందించాల్సి ఉండగా ఆ సంస్థ తన ప్లాంట్‌ను ఓఎన్‌జీసీకి బదలాయించేసింది. పరిహారం ఇవ్వడానికి ఓఎన్‌జీసీ ముందుకు రాకున్నా తమ ప్రభుత్వమే అణాపైసలతో సహా బాధిత కుటుంబాలకు అందజేస్తుందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. 

నాడు ముమ్మిడివరంలో ఇచ్చిన మాటకు కట్టుబడి రూ.80 కోట్లు ఇవ్వడానికి ఇటీవల మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 21న మత్స్యకార దినోత్సవం సందర్భంగా మొత్తం పరిహారం చెల్లించాలని నిర్ణయించారు.

కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా జీఎస్‌పీసీ నిర్వాసిత మత్స్యకారుల పరిహారం అంశాన్ని సీఎం చర్చించారు. పరిహారంగా ఇవ్వాల్సిన రూ.81 కోట్లు  ఓఎన్‌జీసీ చెల్లించేవిధంగా కేంద్ర మంత్రిని ఒప్పించారు.

Follow Us:
Download App:
  • android
  • ios