విజయవాడ: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలో రాష్ట్ర హోంశాఖ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో 2019-20లో అసువులు బాసిన అమరవీరుల సమాచారంతో కూడిన(Police Martyrs of Andhra Pradesh) పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసులు అందిస్తున్న సేవలు, విధినిర్వహణలో ప్రాణాలకు సైతం లెక్కచేయని వారి తెగువను సీఎం ప్రశంసించారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ... పోలీస్ అమరవీరుల కుటుంబాలకు నమస్కారాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈరోజు(అక్టోబర్ 21) అమరవీరులను స్మరించుకునే రోజని...విధినిర్వహణలో భాగంగా ప్రాణాలు వదిలిన ప్రతి పోలీస్ కుటుంభానికి మన దేశం జేజేలు పలుకుతుందన్నారు. 

''తలసరి ఆదాయం చూసి దేశ అభివృద్దిని అంచనా వేస్తారు కానీ నేరాల రేటు తగ్గడం కూడా చాలా ముఖ్యం. రాత్రికి రాత్రి అది జరుగదు, కానీ తగ్గించే ప్రయత్నం మన ప్రభుత్వం ఎప్పుడు చేస్తుంది. లా అండ్ ఆర్డర్ ప్రభుత్వానికి అతి ముఖ్య అంశం. పిల్లలు, మహిళలు, వృద్దుల భద్రత అతి ముఖ్యం. బడుగు, బలహీన వర్గాల వారిపై దాడిని సహించం.  అలాంటి వారిపై చర్యలు తీసుకుని చట్టం ముందు నిలబెట్టాలి. అవతల ఎంత పెద్ద వారు అయినా వదిలే ప్రసక్తే ఉండకూడదు'' అని సూచించారు. 

''మహిళల భద్రత కోసం దిశ బిల్లు తెచ్చాం. దిశ బిల్లు త్వరలో ఆమోదం పొందుతుంది అని ఆశిస్తున్నా. పోలీసుల కష్టం నాకు తెలుసు. కరోనా సమయంలో ఏ స్థాయిలో పోలీసులు పని చేశారో అందరికీ తెలుసు. టెక్నాలజీ విసిరే సవాళ్లు, కోవిడ్ లాంటి హెల్త్ ఎమర్జెన్సీ లు, ఇసుక, మద్యం అక్రమ రవాణా లాంటివి అడ్డుకోవడానికి పడే కష్టం నాకు తెలుసు. ఏడాదికి 6500 పోలీస్  పోస్టులు భర్తీకి ఆమోదం తెలిపాం. పోలీసు అమరవీరుల కుటుంబాలకు మంచి జరగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా'' అని జగన్ అన్నారు.

ఈ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు హోమ్ మినిస్టర్ మేకతోటి సుచరిత, డీజిపి గౌతమ్ సవాంగ్ తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, పోలీస్ ఉన్నతాధికారులు, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.