అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గంలోకి కొత్తగా ఇద్దరు మంత్రులు చేరారు. బుధవారమే సిదిరి అప్పలరాజు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ లు రాజ్ భవన్ లో గవర్నర్ బిస్వభూషన్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. తాజాగా ఇద్దరు మంత్రులకు సీఎం జగన్ శాఖలను కేటాయించారు. దీంతో పలువురు మంత్రుల శాఖల్లో కూడా మార్పుచేర్పులు జరిగాయి. 

ధర్మాన కృష్ణదాస్ కు ఉపముఖ్యమంత్రిగా ప్రమోషన్ లభించడంతో పాటు కీలకమైన  రెవెన్యూశాఖ దక్కింది. దీంతో ఆయన ఇదివరకు నిర్వహించిన రోడ్లు, భవనాల శాఖను మరో మంత్రి మలగుండ్ల శంకర నారాయణకు అప్పగించారు. ఇక శంకరనారాయణ ఇదివరకు నిర్వహించిన బిసి సంక్షేమ శాఖను కొత్తగా మంత్రివర్గంలో చేరిన వేణుగోపాల్ కు అప్పగించారు. అప్పలరాజుకు పశుసంవర్ధక, డెయిరీ, మత్స్య శాఖలను అప్పగించారు. 

read more  14 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు: నాడు జడ్పీ ఛైర్మెన్‌గా, నేడు మంత్రిగా వేణుగోపాల్ ప్రమాణం

మంత్రులుగా ప్రమాణం చేసిన తర్వాత అప్పలరాజు, వేణుగోపాల్ బుధవారం నాడు అమరావతిలో మీడియాతో మాట్లాడారు. బీసీ వర్గాలు వెనుకబడి ఉండడానికి వీల్లేదు... వారంతా ఉన్నత స్థానాలను అధిరోహించాలని సీఎం జగన్ మంచి ఆశయంతో పనిచేస్తున్నారని మంత్రిగా ప్రమాణం చేసిన వేణుగోపాల్ ప్రకటించారు. ఈ మాటలకు తగ్గట్లుగానే ఆ శాఖను వేణుగోపాల్ కే కేటాయించారు. 

తూర్పుగోదావరి జిల్లా నుండి శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ కు ఎంపీ పదవి ఇవ్వడంపై కూడా వేణుగోపాల్ హర్షం వ్యక్తం చేశారు. అదే సామాజిక వర్గానికి చెందిన తనకు మంత్రి పదవి ఇవ్వడం బీసీలపై జగన్ కు ఉన్న ప్రేమకు నిదర్శంగా చెప్పారు. తనకు తల్లిదండ్రులు జన్మనిస్తే రాజకీయంగా  వైఎస్ఆర్ జన్మనిచ్చారని ఆయన గుర్తు చేసుకొన్నారు. 

ఇక తనను మంత్రివర్గంలోకి తీసుకోవడం పట్ల అప్పలరాజు సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. తనపై ముఖ్యమంత్రి పెట్టుకొన్న నమ్మకాన్ని వమ్ముచేయబోనన్నారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి మంచి పేరు తీసుకువస్తానని ఆయన హామీ ఇచ్చారు.