అమరావతి: జిల్లా పరిషత్ ఛైర్మెన్ గా బాధ్యతలు స్వీకరించిన రోజునే చెల్లుబోయిన వేణుగోపాల్ మంత్రిగా  ప్రమాణం చేశారు.. జిల్లా పరిషత్ ఛైర్మెన్ కు కూడ కేబినెట్ హోదా. తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైనా కూడ వేణుగోపాల్ కు జగన్ మంత్రి పదవిని కట్టబెట్టారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో చెల్లుబోయిన వేణుగోపాల్ రాజకీయాల్లో రాణించారు. ప్రస్తుతం వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్ నేతృత్వంలోని కేబినెట్  సభ్యుడిగా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు.

తూర్పుగోదావరి జిల్లా  రాజోలు మండలం అడవిపాలెం గ్రామం చెల్లుబోయిన వేణుగోపాల్‌ది. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసేవాడు. 2001లో జరిగిన ఎన్నికల్లో రాజోలు నుండి ఆయన జడ్‌పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

2006లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీంతో జిల్లా పరిషత్ ఛైర్మెన్ గా చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ ఎన్నికయ్యారు. 2006 జూలై 22వ తేదీన ఆయన జడ్పీ ఛైర్మెన్ గా బాధ్యతలు స్వీకరించారు.14 ఏళ్ల తర్వాత అదే రోజున మంత్రిగా వేణుగోపాల్ కృష్ణ ప్రమాణం చేశారు.

జిల్లా పరిషత్ ఛైర్మెన్ గా ఆనాడు వైఎస్ఆర్ తనకు అవకాశం కల్పించారని వేణుగోపాల్ కృష్ణ గుర్గు చేసుకొన్నారు. మంత్రిగా ప్రస్తుతం వైఎస్ఆర్ తనయుడు జగన్ తనకు అవకాశం కల్పించినట్టుగా చెప్పారు.

 2008 నుండి 2012 వరకు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాడు. వైఎస్ జగన్ పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత వైఎస్ఆర్‌సీపీలో చేరాడు. 2014 ఎన్నికల్లో కాకినాడ రూరల్ అసెంబ్లీ స్థానం నుండి ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2019 ఎన్నికల్లో ఆయన రామచంద్రాపురం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించాడు.

ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏడాది తర్వాత జగన్ కేబినెట్లోకి వేణుగోపాల్ కు స్థానం దక్కింది. ఇదే జిల్లాలోని ఇదే నియోజకవర్గం నుండి గతంలో ప్రాతినిథ్యం వహించిన పిల్లి సుభాష్ చంద్రబోస్  జగన్ కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా పనిచేశారు.

శాసనమండలిని రద్దు చేయాలనే నిర్ణయంంతో పిల్లి సుభాష్ చంద్రబోస్ ను రాజ్యసభకు పంపడంతో సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు మంత్రి పదవులకు రాజీనామా చేశారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ శెట్టి బలిజ సామాజికవర్గానికి చెందినవాడు. దీంతో అదే సామాజికవర్గానికి చెందిన వేణుగోపాల్ కు జగన్ మంత్రి పదవి ఇచ్చారు.