మనవడితో గడపడానికి కూడా బాబుకు తీరిక లేదు: నారా లోకేష్

CM is not getting time to spend with grandson
Highlights

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మనవడితో కూడా గడపలేకపోతున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అన్నారు.

గుంటూరు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మనవడితో కూడా గడపలేకపోతున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళవారం గుంటూరు జిల్లా వినుకొండలో జరిగిన నవ నిర్మాణ దీక్షలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబు రేయింబవళ్లు రాష్ట్రం కోసం శ్రమిస్తున్నారని చెప్పారు. నిరంతరం ప్రజల గురించే ఆలోచిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రం కోసం ఎంతో కష్టపడుతున్న చంద్రబాబును ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని, ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ప్రధాని మోడీ అని, మోడీని ప్రతిపక్షాలు విమర్శించడం లేదని అన్నారు. రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచిన మోడీని ప్రతిపక్షాలు ఒక్క మాట కూడా అనడం లేదని విమర్శించారు.

బయట నుంచి ఎవరైనా నీ కులం ఏమిటని అడిగితే మనం ఒకటే చెప్పాలి, మా కులం ఆంధ్రా, మా మతం ఆంధ్రా, మా ప్రాంతం ఆంధ్రా అని చెప్పాలని లోకేష్ అన్నారు. కులం, మతం, ప్రాంతం తీసుకువచ్చి తమ మధ్య చిచ్చు పెట్టవద్దని, అలాంటివాళ్లు ఎవరైనా వస్తే తరిమి... తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ఆయన అన్నారు.
 
 గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం వేల్పూర్‌లో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

loader