నేడు సీఎంగా చంద్రబాబు బాధ్యతలు... తొలి సంతకం ఆ ఫైలుపైనే...
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇలా సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన కీలకమైన ఐదు ఫైళ్లపై సంతకాలు చేయనున్నట్లు సమాచారం. అవేంటంటే...
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో అధికార మార్పిడి ప్రక్రియ పూర్తయ్యింది. ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన టిడిపి కూటమి వైసిపి నుండి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఇప్పటికే టిడిపి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది... ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, మంత్రులుగా పవన్ కల్యాణ్ తో పాటు మరికొందరు ప్రమాణస్వీకారం చేసారు. ఇవాళ (గురువారం) సచివలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు చంద్రబాబు. ఈ క్రమంలో ఆయన తొలి సంతకం ఏ ఫైలుపై వుంటుందన్న చర్చ ప్రజల్లో సాగుతోంది.
అయితే ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు నాయుడు నిరుద్యోగ యువతకు మెగా డిఎస్సి పై హామీ ఇచ్చారు. ఓ ఆడబిడ్డ తనకు పెన్నును బహూకరించింది... సీఎం అయ్యాక ఈ పెన్నుతోనే మెగా డిఎస్సిపై తొలి సంతకం చేయాలని కోరింది... ఖచ్చితంగా అలాగే చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కాబట్టి ఇచ్చిన మాటప్రకారం టీచర్ ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఫైలును అధికారులు సిద్దం చేయగా దీనిపైనే చంద్రబాబు తొలి సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఎన్నికల ప్రచార సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ సర్కార్ తీసుకువచ్చిన ఈ చట్టం రైతులకు మేలు కాదు కీడు చేస్తోందని టిడిపి, జనసేన, బిజెపి కూటమి తెగ ప్రచారం చేసింది. అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. కాబట్టి సీఎంగా బాధ్యతలు చేపట్టగానే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైనే చంద్రబాబు రెండో సంతకం చేయనున్నారు.
ఇక వృద్దులు, దివ్యాంగులకు ప్రభుత్వం అందించే ఫించన్లను భారీగా పెంచుతామని టిడిపి కూటమి హామీ ఇచ్చింది. ఇలా వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు ఫించన్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ ఫించన్ల పెంపుపైనే సీఎం చంద్రబాబు మూడో సంతకం చేయనున్నారు.
ఇక గతంలో టిడిపి ప్రభుత్వం నిరుపేదల ఆకలి బాధ తీర్చేందుకు అన్న క్యాంటిన్లను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. అయితే గత ఐదేళ్ల వైఎస్ జగన్ పాలనలో అన్న క్యాంటిన్ సేవలు నిలిచిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 183 అన్న క్యాంటిన్లలో రూ.5 కే భోజనం అందించే అన్న క్యాంటిన్లు మూతపడ్డాయి. వీటిని తిరిగి పునరుద్దరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్దమయ్యింది... సీఎంగా బాధ్యతలు చేపట్టగానే ఈ ఫైలుపైనే ఆయన నాలుగో సంతకం చేయనున్నట్లు సమాచారం.
ఇక టిడిపి కూటమి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మరో హామీ నైపుణ్య గణన. రాష్ట్రంలోని యువత నైపుణ్యాన్ని గుర్తించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నారు. అవసరమైన వారికి నైపుణ్య శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ఇలా నైపుణ్య గణన నిరుద్యోగ యువతకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ నైపుణ్య గణనకు సంబంధించిన ఫైలుపై చంద్రబాబు ఐదో సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది.