పడవ ప్రమాదం: లాంచీ తలుపుల మూసివేతనే ప్రాణాలు తీసిందా?

First Published 17, May 2018, 8:33 AM IST
Closure of Boat doors main reason for deaths
Highlights

లాంచీ తలుపులు మూసివేయడం వల్ల ప్రయాణికుల ప్రాణాలు తీసినట్లు భావిస్తున్నారు.

కాకినాడ: లాంచీ తలుపులు మూసివేయడం వల్ల ప్రయాణికుల ప్రాణాలు తీసినట్లు భావిస్తున్నారు. వాడపల్లిలలో ఇద్దరు ప్రయాణికులు దిగాల్సి ఉండడంతో లాంచీ వాడపల్లి వైపు వెళ్లిందని, ఈ స్థితిలో లాంచీ దిశను సరంగి అటు మళ్లించాడని చెబుతున్నారు. 

ఆ సమయంలో గాలుల తీవ్రత పెరిగి ప్రమాదం సంభవించిందని అంటున్నారు. లాంచీపైన టెంటు వేయడం, లాంచీ తలుపులు మూసి ఉండడం వల్ల గాలి ఒక వైపు నుంచి మరో వైపునకు వెళలేకపోయిందని, దాంతో లాంచీపై గాలి ఒత్తిడి ఎక్కువై అది అదుపు తప్పిందని అంటున్నారు. 

ఆ ప్రమాదాన్ని ప్రయాణికులు పసిగట్టలేకపోయారని చెబుతున్నారు. లాంచీలో సిమెంట్ బస్తాలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయని, ఆ బరువుకు లాంచీ గోదావరి నదిలో కిందకు జారిపోయిందని చెబుతున్నారు.

లాంచీలోకి నీరు చేరుతున్నా మూసిన తలుపులు చేతులకు అందకపోవడంతో లోపల ఉన్నవారు బయటకు రాలేకపోయారనే మాట వనిపిస్తోంది. ప్రమాదం జరిగిన స్థలం ఉభయ గోదావరి జిల్లాల గట్టుకు కేవలం 300 మీటర్ల దూరంలోనే ఉంది. మహిళలకు కూడా ఈత వస్తుందని, అందువల్ల తలుపులు తెరిచి ఉంటే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదని అంటున్నారు. 

ఈ ప్రమాదంలో 22 మంది మరణించగా, మరో 22 మంది ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే. మరో మూడు మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

loader