నమ్మిన వాళ్ళే దెబ్బ కొడుతున్నారు

నమ్మిన వాళ్ళే దెబ్బ కొడుతున్నారు

నమ్మిన వాళ్ళే దెబ్బ కొడితే ఏం చేయాలి ? మళ్ళీ ఇంకో నమ్మకస్తుడిని అప్పటికప్పుడు తయారు చేసుకోవటం సాధ్యమా ? నమ్మకమన్నది తయారు చేసుకునే వస్తువు కాదు కదా బజారులో కొనుక్కోవటానికి? మరేం చేయాలి? ఇపుడదే వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా వేధిస్తున్న ప్రశ్న. ఇపుడేదో గిడ్డి ఈశ్వరి వైసిపిలో నుండి టిడిపిలోకి ఫిరాయించిందని కాదు. మొదటి నుండి జగన్ విషయంలో అదే జరుగుతోంది. నమ్మి చేరదీసిన వాళ్ళే సమయం చూసి మరీ జగన్ ను దెబ్బ కొడుతున్నారు.

2014లో ఎన్నికలయ్యాక పరిస్ధితే తీసుకోండి. తూర్పు గోదావరి జిల్లాలో జ్యోతుల నెహ్రూకు జగన్ బాగా ప్రాధాన్యత ఇచ్చారు. నెహ్రూ చెప్పారనే రెండు మూడు టిక్కెట్లు కూడా ఇచ్చారు. అలాంటిది మంత్రి పదవి కోసం చివకు జగన్ ను కాదనుకుని తన మద్దతుదారులతో టిడిపిలోకి ఫిరాయించారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఓ క్యాబినెట్ ర్యాంకు పోస్టు వస్తుంది. అసెంబ్లీ పిఏసి ఛైర్మన్ పోస్టు. దానిని భూమా నాగిరెడ్డికి అప్పగించారు. అయితే, ఏడాదికిపైగా  క్యాబినెట్ ర్యాంకును ఎంజాయ్ చేసిన తర్వాత భూమా కూడా కూతురు, బావమరదితో టిడిపిలోకి ఫిరాయించారు.

ఆధరించి టిక్కెట్టిచ్చి గెలిపించుకున్న ఆదినారాయణరెడ్డి కూడా వైసిపి నుండి వెళ్ళిపోయి మంత్రిపదవి తీసుకున్నారు. ఉత్తరాంధ్రలోని బొబ్బిలి రాజులని సుజయ్ కృష్ణ రంగారావుకు జగన్ ఎంతో ప్రాధాన్యత ఇస్తే వాళ్ళూ దెబ్బకొట్టి టిడిపికి జై కొట్టారు. మరో ఫిరాయింపు మంత్రి ఎన్. అమరనాధరెడ్డిది కూడా అదే దారి. తాజాగా ఫిరాయించిన గిడ్డి కూడా మంత్రిపదవి హామీతోనే పార్టీ మారినట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో ఎవరిని నమ్మాలన్నా ఒకటికి పదిసార్లు జగన్ ఆలోచించాల్సి వస్తోంది.

అప్పులు తీర్చుకోవటానికని కొందరు, మంత్రిపదవుల కోసం మరికొందరు, కాంట్రాక్టులు, ఆర్ధిక అవసరాలని ఇంకొందరు..ఇలా కారణాలేవైనా ఇప్పటికి 23 మంది ఫిరాయించేశారు. టిడిపి కూడా నిశ్శుగ్గుగా బహిరంగంగానే తమ గొప్పదనం చూడండని జబ్బలు చరుచుకుంటోంది. ఇక్కడే చంద్రబాబు-జగన్ మధ్య ఒక పోలిక స్పష్టమవుతోంది. ప్రతిపక్షంలో ఉన్నపుడు చంద్రబాబు పరిస్ధితి ఇంతకన్నా ఘోరంగా ఉండేది. అయితే, అప్పట్లో టిడిపి నుండి వైసీపీలోకి వస్తామన్న చాలామంది ఎంఎల్ఏల చేత జగన్ అప్పట్లో రాజీనామాలు చేయించే పార్టీలోకి చేర్చుకున్నారు. మరి, ప్రతీరోజు విలువల గురించి క్లాసులు తీసుకునే చంద్రబాబు ఏం చేస్తున్నారు?

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos