విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. పెదబయలు మండలం గలగండ పంచాయితీ సమీపంలోని సిరసపల్లిలో బాలుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. గ్రామానికి చెందిన రోహిత్ అనే బాలుడు గత ఆదివారం పశువులు మేపడానికి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు.

రోహిత్‌తో పాటు మరో ఐదుగురు అడవిలోకి వెళ్లారు. అయితే అడవి నుంచి తిరిగి వస్తుండగా రోహిత్ సెల్ కనిపించకపోవడంతో వెనక్కి వెళ్లాడు. అప్పటి నుంచి రోహిత్ తల్లిదండ్రులు బాలుడి కోసం వెతుకుతున్నారు.

ఈ క్రమంలో శనివారం ఉదయం కుళ్లిపోయిన స్థితిలో రోహిత్ మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. తమ బిడ్డను విగతజీవిగా చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఈ ఘటనతో సిరసపల్లిలో విషాద చాయలు అలుముకున్నాయి. రోహిత్ పెద్దబయలులో 7వ తరగతి చదువుతున్నాడు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.