రచ్చ రచ్చగా మారిన రచ్చబండ
గ్రామస్థుల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమం కాస్త రచ్చరచ్చగా మారింది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం సీతారామపురంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. బాబుజగ్జీవన్‌రావు విగ్రహానికి పూలమాలలు వేసే విషయంపై ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి.
విగ్రహానికి ముందుగా వైకాపా నేతలు పూలమాల వేయడంతో తెదేపా నేతలు పాలాభిషేకం చేసి విగ్రహాన్ని శుద్ధి నిర్వహించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆరుగురికి స్వల్ప గాయాలు కాగా వారిని నూజివీడు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఇరు పార్టీల నేతలు హనుమాన్ జంక్షన్ పోలీసులకు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.
