ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఎవరికీ కంటి సమస్యలు ఉండకూడదనే ఉద్దేశంతో సీఎం జగన్... ‘వైఎస్ఆర్ కంటి వెలుగు’ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకాన్ని గురువారం అనంతపురం జిల్లాలో ప్రారంభిస్తున్నారు. మొదటి విడుతలో 70లక్షల మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేస్తామని జగన్ చెప్పారు.

కాగా... ఈ కార్యక్రమం కోసమే నేడు జగన్ అనంతపురం వచ్చారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక్కడికి రావడం ఇదే తొలిసారి. అయితే... ఆయన రాక సందర్భంగా ఓ ఎమ్మెల్యే, మంత్రికి వాగ్వాదం జరగడం గమనార్హం.

జిల్లాకు వచ్చిన జగన్మోహన్ రెడ్డికి మంత్రి శంకర్ నారాయణ, ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అయితే.. హెలిప్యాడ్ వద్ద సీఎం జగన్ వద్దకు వెళ్లి స్వాగతం చెప్పే జాబితాలో తన పేరు లేకపోవడంతో ఎమ్మెల్యే పెద్దారెడ్డి చిన్నబుచ్చుకున్నారు.

తనను కించపరిచారంటూ... మంత్రి శంకర్ నారాయణపై మండిపడ్డారు. తన పేరు ఎందుకు  చేర్చలేందూ మంత్రిని నిలదీశారు. ఈ క్రమంలో మంత్రి, ఎమ్మెల్యే మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కాగా.. అక్కడే ఉన్న స్థానిక నేతలు వారిద్దరినీ శాంతిపరచడంతో గొడవ సద్ధిమణిగింది.