జమ్మలమడుగులో కొనసాగుతున్న ఉద్రిక్తత : టిడిపి, వైసిపి కార్యకర్తల మధ్య గొడవ

Clash Between TDP And YCP Activists In Jammalamadugu
Highlights

పెద్ద దండ్లూరులో కొనసాగుతున్న 144 సెక్షన్ 

కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మండల పరిధిలోని పెద్ద దండ్లూరు లో గత నెల 25 న ఓ పెళ్లి సందర్భంగా అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపి కార్యకర్తల మద్య గొడవ చెలరేగింది. అది కాస్తా ఒక వర్గం పై మరో వర్గం దాడులు చేసుకునేంత దూరం వెళ్లింది. అప్పటినుండి ఏ క్షణంలో ఏం జరుగుంతో తెలియకుండా గ్రామంలోనే కాదు మండల వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. 

అసలు ఈ గొడవకు దారి తీసిన సంఘటన గురించి తెలుసుకుందాం. గత నెల మే 25 న పెద్ద దండ్లూరు గ్రామానికి చెందిన కానిస్టేబుల్ సంపత్ వివాహం జరిగింది. ఈ పెళ్లికి స్థానిక ఎంపి అవినాష్ రెడ్డి వస్తున్నట్లు, ఆయన సమక్షంలో పలువురు టిడిపి నాయకులు వైసిపి పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. దీంతో ఆగ్రహించిన టిడిపి కార్యకర్తలు కొందరు ఈ పెళ్లిలోకి వెళ్లి అక్కడి వారిపై దాడికి దిగారు. దీంతో అక్కడే వున్న వైసిపి కార్యకర్తలకు, టిడిపి నాయకులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు.  ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు.

అప్పటినుండి ఈ గ్రామంలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. పోలీసులు 144 సెక్షన్ విధించి పరిస్థితులను అదుపులోకి తీసువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జమ్మలమడుగు పరిసరాల్లో ఈ నెల 6 వరకు 144 సెక్షన్‌ కొనసాగనుంది. గ్రామ సరిహద్దుల్లో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేసి బయటి వ్యక్తులెవరూ గ్రామంలోకి రానివ్వడంలేదు. 

పెద్ద దండ్లూరుకు చేరుకోని తన వర్గీయులను ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పరామర్శించారు. అయితే ఎంపీ అవినాష్ రెడ్డిని మాత్రం పోలీసులు పెద్ద దండ్లూరుకు వెళ్లడానికి అనుమతించడం లేదు. దీంతో జమ్మలమడుగుకు చేరుకున్న ఎంపీ అవినాష్ రెడ్డి...రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ఉన్నారు. పెద్ద దండ్లూరును సందర్శించేంత వరకు జమ్మలమడుగు నుంచి వెళ్ళేది లేదంటూ ఎంపి అవినాష్ పట్టుబడుతున్నారు. దీంతో మరోసారి జమ్మలమడుగు లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.


 

loader