ఏపీని ఆదుకోకుండా రాజకీయాలా?: బీజేపీపై శివాజీ విమర్శలు, సీఎం రమేష్‌కు పరామర్శ

Cine actor Shivaji slams on Bjp
Highlights

బీజేపీపై సినీ నటుడు శివాజీ ఘాటు వ్యాఖ్యలు

కడప: రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక  హోదా చాలా అవసరమని సినీ నటుడు శివాజీ అభిప్రాయపడ్డారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి‌లను  మంగళవారం నాడు సినీ నటుడు శివాజీ పరామర్శించారు.

రాష్ట్ర విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. ప్రత్యేక హోదా లభిస్తేనే రాష్ట్రానికి న్యాయం జరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.   పార్టీలకు అతీతంగా  రాష్ట్రానికి న్యాయం చేయాలని పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీ నాలుగేళ్ళుగా రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని ఆయన విమర్శించారు. 

 రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రను ఆదుకోవాల్సింది పోయి బీజేపీ రాజకీయాలు చేస్తోందన్నారు. కడప జిల్లాకు ఉక్కు కర్మాగారం కేటాయించని ఆ పార్టీ రాయలసీమ డిక్లరేషన్‌ పేరుతో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. 

ఏపీకి రూ.2లక్షల కోట్ల అప్పు ఉందని కొందరు నేతలు చేస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ప్రస్తుతం ఏపీకి రూ.82వేల కోట్ల అప్పు మాత్రమే ఉందని శివాజీ తెలిపారు.  విభజన వల్ల వచ్చిన అప్పే రూ.52వేల కోట్లని వెల్లడించారు. 

తిరుమల ఆలయాన్ని రాష్ట్రం నుంచి వేరు చేసేలా రాజకీయాలు చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తొక్కిపడేస్తారని హెచ్చరించారు.‌ కొన్ని పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి కేంద్రంతో అంటకాగడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. 

తాను తెలుగుదేశం పార్టీకి మద్దతివ్వడానికి రాలేదన్నారు. ఉక్కు పరిశ్రమ కోసం ప్రాణత్యాగాలకు సిద్ధపడిన నేతలకు సంఘీభావం ప్రకటించేందుకే ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. హక్కుల కోసం కేంద్రంతో పోరాడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి అందరూ అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు ఓట్లేసి అధికారం కట్టబెట్టిన పార్టీకి ఐదేళ్లు పాలించే అవకాశం ఇవ్వాలన్నారు.వారు తప్పుచేస్తే తర్వాతి ఎన్నికల్లో ప్రజలే గద్దె దించేస్తారని అన్నారు.

ఇదిలా ఉంటే  ఆరు రోజులుగా ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి  ఆరోగ్యం క్షీణించినట్టు వైద్యులు చెబుతున్నారు. వారిని ఆసుపత్రికి తరలించాలని వారు సూచిస్తున్నారు.

loader