హైదరాబాద్: థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న సినీనటుడు పృధ్వీరాజ్ మాంచి హుషారు మీద ఉన్నారట. ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తోందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటంతో ఆయన తెగ సంతోషపడిపోతున్నారట. 

టాలీవుడ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పృధ్వీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం చాలా శ్రమించారనే చెప్పాలి. ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్ అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగారు. ఒకవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలు చేస్తూ తెగ బిజీబిజీగా గడిపారు. 

అంతేకాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో కూడా కీలక పాత్ర పోషించారు పృధ్వి. ప్రజా సంకల్పయాత్ర ముగిసిన అనంతరం పృధ్వీరాజ్ సినీ ఇండస్ట్రీపై ప్రత్యేక దృష్టిసారించారు. పలువురు కమెడియన్స్, యాంకర్ లను, టీవీ ఆర్టిస్టులను వైసీపీలో చేర్పించడంలో కీలక పాత్ర పోషించారు. 

అంతేకాదు వారితో కలిసి ఉత్తరాంధ్ర నుంచి మెుదలుకుని రాష్ట్ర వ్యాప్తంగా కళాజాతరలు చేపట్టారు. పాటల రూపంలో, నాటకాల రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేశారు. ఉత్తరాంధ్రను అయితే పృధ్వీరాజ్ అనువనువు పర్యటించేశారని చెప్పుకోవాలి. 

ఉత్తరాంధ్రలో తెలుగుదేశం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఓటర్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవైపు ఆకర్షించేందుకు తన బృందంతో వివిధ కార్యక్రమాలు చేపట్టారు పృధ్వి. అంతేకాదు ఆయా నియోజకవర్గాల అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమంలోనూ ఎంతో హుషారుగా పాల్గొన్నారు. 

ఎన్నికలు ముగియడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అధికారం అంటూ ప్రచారం జరగుతుండటంతో ఆయన తెగ సంబరపడిపోతున్నారట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా తాను చేసిన సేవలను గుర్తించిన పార్టీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. 

అయితే ఎన్నికల్లో తాను చేసిన ప్రచారం వైఎస్ జగన్ దృష్టికి వెళ్లడంతో తనకు ప్రత్యేక గుర్తింపు ఇస్తారని ఆశతో ఉన్నారట. గతంలో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యాలని పృధ్వి ఉవ్విళ్లూరారు. అయితే జగన్ ఈసారి వద్దు అని చెప్పడంతో వెనక్కి తగ్గారు. 

భవిష్యత్ మనదేనని కచ్చితంగా గుర్తింపు ఇస్తానని జగన్ హామీ ఇచ్చారట. దీంతో ఎన్నికల ఫలితాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారట. రోజులు లెక్కలేసుకుంటున్నారట. మరి పృధ్వీరాజ్ ఆశలు నెరవేరుతాయా లేదా అన్నది మే 23 వరకు వేచి చూడాల్సిందే.