కేంద్రం నుండి వచ్చిన మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయడు, సురేష్ ప్రభు తదితరులు చంద్రబాబును ఆకాశానికి ఎత్తేసారు. ఒకరకంగా చంద్రబాబును పొగిడేందుకు ఒకరితో మరొకరు పోటీ పడ్డారంటే బాగుంటుందేమో.
విశాఖపట్నంలో చంద్రబాబునాయుడు అభినందన సభ బాగానే జరుగుతున్నది. దేశ, విదేశాల నుండి వచ్చిన పలువురు ప్రముఖులు చంద్రబాబును పొడగటమే పనిగా పెట్టుకున్నట్లు కనబడుతోంది. పేరుకేమో పెట్టుబడుల కోసం ‘భాగస్వామ్య సదస్సు’. కానీ జరుగుతున్నదేమో చంద్రబాబు భజన కమ్ అభినందన సభ. కేంద్రం నుండి వచ్చిన మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయడు, సురేష్ ప్రభు తదితరులు చంద్రబాబును ఆకాశానికి ఎత్తేసారు. ఒకరకంగా చంద్రబాబును పొగిడేందుకు ఒకరితో మరొకరు పోటీ పడ్డారంటే బాగుంటుందేమో.
వీరికి తోడు పారిశ్రామికవేత్త గ్రంధి మల్లికార్జురావు లాంటివారు వుండనే ఉన్నారు. ఎవరు మాట్లాడినా ఆహో, వోహో అనే. గడచిన రెండున్నర సంవత్సరాల్లో రాష్ట్రంకు వచ్చిన భారీ పరిశ్రమ ఏమన్నా ఉందా అంటే ఒక్కటీ కనబడటం లేదు. పోయిన సారి నిర్వహించిన భాగస్వామ్య సదస్సు వల్ల రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులెన్నంటే చెప్పటానికి ప్రభుత్వమే మొహం చాటేస్తోంది. సమాచార హక్కు చట్టం ద్వారా అడిగితే పెట్టుబడులు ఏమీ రాలేదనే సమాధానమిచ్చింది. ఇంతోటిదానికి కోట్ల రూపాయల వ్యయం మళ్లీ.
ఇపుడు కూడా తాజాగా శుక్రవారం మొదలైన సదస్సులో పలువురు పారిశ్రామికవేత్తలు, విదేశీ ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న భూసమీకరణ విధానం దేశం మొత్తానికి ఆదర్శమంటూ జిఎంఆర్ చెప్పటం విశేషం. తాను ఎక్కడికెళ్ళినా చంద్రబాబును అందరూ ప్రశంసిస్తున్నట్లు చెప్పటం ఆశ్చర్యం. రైతుల గోళ్ళూడగొట్టి, భూములు ఇవ్వటానికి నిరాకరించిన రైతుల పంటలను తగలబెట్టి మరీ భూములను తీసుకుంటున్నది ప్రభుత్వం. దేశవ్యాప్తంగా రైతుల పొలాలను అదే రీతిలో సమీకరించాలన్నది జిఎంఆర్ ఉద్దేశ్యమేమో. ఎందుకంటే, రైతుల పొలాలు వచ్చేది జిఎంఆర్ లాంటి పారిశ్రామికవేత్తల చేతుల్లోకే కదా.
అమరావతిని చంద్రబాబు మినీ సింగపూర్ లాగ తయారు చేస్తారని చెప్పటం గమనార్హం. అంటే, ఏపి రాజధానిలో తెలుగుతనం మాత్రం ఎక్కడా కనబడదని పలువురు అనుకోవటం నిజమేనన్నమాట. ప్రభుత్వ లెక్కల ప్రకారం మొదటి రోజే రూ. 4.25 లక్షల కోట్ల పెట్టుబడులకు 128 ఎంఒయులు జరిగాయి. సదస్సు పూర్తయిన తర్వాత ప్రభుత్వం చెప్పే లెక్కలు ఏ మేరకు ఉంటాయో చూడాలి. ఎందుకంటే, పోయినసారి కూడా ఇదే పద్దతిలో ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. అంటే చంద్రన్న ప్రభుత్వం కేవలం ప్రచారం మీదే బ్రతికిపోతోంది. మొత్తం మీద సదస్సు నిర్వహణకు కోట్ల రూపాయలు వ్యయం అయినా చంద్రబాబు అబినందన సభ మాత్రం భారీగానే జరుగుతోంది.
