Asianet News TeluguAsianet News Telugu

అమరావతి భూముల కేసు: మాజీ మంత్రి నారాయణ ఇళ్లలో సిఐడి సోదాలు

మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ నివాసాల్లో సిఐడి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మూడు ప్రధాన నగరాల్లో గల ఆయన నివాసాల్లో అమరావతి భూముల వ్యవహారంలో సోదాలు చేస్తున్నారు.

CID officials issues notice to TDP leader Narayana and raid houses
Author
Amaravathi, First Published Mar 17, 2021, 1:04 PM IST

అమరావతి:  ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు నారాయణ నివాసాల్లో సిఐడి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అమరావతి భూముల కొనుగోలు కేసులో చంద్రబాబుతో పాటు ఆయనకు నోటీసులు జారీ చేయాల్సి ఉండింది. అయితే, నారాయణ నివాసం చిరునామా తెలియకపోవడంతో మంగళవారంనాడు ఇవ్వలేకపోయారు. దీంతో బుధవారంనాడు ఆయన నివాసానికి వెళ్లారు.

ఈ నేపథ్యంలో ఆయన నివాసాల్లో సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. హైదరాబాదు, నెల్లూరు, విజయవాడల్లోని నారాయణ నివాసాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కోసం అమరావతిలోనూ, ఆ చుట్టుపక్కల భూములను సేకరించడంలో నారాయణ కీలక పాత్ర పోషించారు.

హైదరాబాదులోని నారాయణ నివాసానికి సిఐడి అధికారులు వచ్చారు. అయితే ఆయన ఇంట్లో లేకపోవడంతో ఆయన భార్య రమాదేవికి నోటీసులు అందజేశారు. తన భర్త సిఐడి అధికారుల ముందు హాజరవుతారని రమాదేవి చెప్పారు. ఈ నెల 22వ తేదీన విచారణకు హాజరు కావాలని సిఐడి అధికారులుర తమ నోటీసులో సూచించారు.

చంద్రబాబు మంత్రివర్గంలో ఆయన పనిచేస్తూ రాజధాని అమరావతి భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినట్లు సిఐడి ఆరోపిస్తోంది. అమరావతి ప్రాంతంలో భూముల వ్యవహారంపై వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సిఐడికి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై విచారణ జరిపిన సిఐడి కేసులు నమోదు చేసింది.

చంద్రబాబుకు మంగళవారం సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలా, వద్దా అనే విషయంపో చంద్రబాబు న్యాయనిపుణులతోనూ పార్టీ నేతలతోనూ చర్చలు జరుపుతున్నారు. ఆయన కోర్టుకెక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని ఆయన కోర్టును కోరే అవకాశం ఉంది.

చంద్రబాబు మంత్రివర్గంలో ఉంటూ టీడీపీ ప్రభుత్వ హయాంలో చురుగ్గా పనిచేసిన నారాయణ వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజకీయాల జోలికి రావడం లేదు. ఆయన టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios