అమరావతి: మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను ఇంకా కేసులు వెంటాడే అవకాశం లేకపోలేదనే ప్రచారం సాగుతోంది. ఆప్కో లో చోటు చేసుకొన్న అవకతవకలపై జగన్ సర్కార్ సీఐడీ విచారణ మరింత వేగవంతం చేసింది. ఆప్కో మాజీ ఛైర్మెన్ శ్రీనివాసులు ఇంట్లో సీఐడీ అధికారులు ఇటీవల కాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సమయంలో కీలక పత్రాలను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారని చెబుతున్నారు.

చంద్రబాబునాయుడు ఏపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో పలు రంగాల్లో అవినీతి చోటు చేసుకొందని జగన్ ఆరోపణలు చేశారు. అధికారాన్ని చేపట్టిన తర్వాత పలు అంశాలపై విచారణకు ఆదేశించారు. ఆప్కోలో చోటు చేసుకొన్న అవినీతిపై సీఐడీ విచారణకు జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రి గా పనిచేసిన అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు ఏసీబీ అరెస్ట్ చేసింది. వైసీపీ నేత మోకా భాస్కర్ రావు హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టయ్యారు. ఈ నెల 24వ తేదీన  రవీంద్రకు బెయిల్ వచ్చింది. 

ఆప్కోలో కేంద్ర నిధుల్లో గోల్ మాలో అయినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషయమై సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో చేనేత, జౌళి శాఖ మంత్రులుగా పనిచేసిన అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రల పాత్ర ఉందా  అనే కోణంలో కూడ అధికారులు దర్యాప్తును చేపట్టారు.

సర్వశిక్షా అభియాన్ తో పాటు ఇతర స్కీమ్ ల కింద వచ్చిన నిధుల్లో అవకతవకల విషయమై కూడ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గత ప్రభుత్వ హాయంలో స్కూల్ యూనిఫారాలను విద్యార్థులకు అందించారు. 

ఈ స్కూల్ యూనిఫారాల్లో భారీగా అవకతవకలు చోటు చేసుకొన్నాయని సీఐడీ అధికారులు అనుమానిస్తున్నారు. గత ప్రభుత్వ హయంలో చేనేత,జౌళి శాఖలో పనిచేసిన అధికారుల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో కూడ విచారణ చేస్తున్నారు. అంతేకాదు అప్పట్లో పనిచేసిన ఆప్కో ఎండీతో పాటు ఇతర కీలక అధికారులను కూడ ఈ విషయమై ఆరా తీసే అవకాశం లేకపోలేదు.

ఆప్కో విషయంలో సీఐడీ విచారణ పూర్తైన తర్వాత  ఈ కేసును సీబీఐకి బదిలీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆప్కోలో ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులే ఉన్నందున ఈ కేసును వీలును బట్టి సీబీఐకి బదిలీ చేయాలని కూడ ప్రభుత్వం భావిస్తోందని సమాచారం.