తెలుగు రాష్ట్రాల్లో కుంపటి వెలిగించిన కంచె ఐలయ్య అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్న సీఐడీ అధికారులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సమస్యలకే అంతా మల్లగుల్లాలు పడుతుంటే.. ఇప్పుడు మరో కొత్త సమస్య వచ్చి చేరింది. ఎప్పటి నుంచో ఏపీలో ఎస్సీల వివాదం నలుగుతోంది.. కొంత కాలం క్రితం కాపులు తమకు రిజర్వేషన్లు కావాలంటూ ఉద్యమం చేపట్టారు. ఇవి చాలవన్నట్టు.. ఆర్యవైశ్యుల వివాదం తెరపైకి వచ్చింది. కంచె ఐలయ్య.. ఇటీవల ‘ కోమటోళ్లు సామాజిక స్మగ్లర్లు’ అంటూ ఓ పుస్తకం రాసి .. తెలుగు రాష్ట్రాల్లో కుంపటి వెలిగించారు. దీంతో ఆ సామాజిక వర్గమంతా అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

ఏ వ్యక్తికైనా.. తనకు నచ్చినవిధంగా పుస్తకం రాసుకునే స్వేచ్ఛ ఉంది. కానీ.. ఒకరిని కించ పరిచేలా.. ఒక సామాజిక వర్గం మొత్తాన్ని తప్పుపట్టడం సరికాదని పలువురి వాదన. కొందరు ఆర్యవైశ్యులు వ్యాపారాల్లో లాభాలు పొంది ఉండవచ్చు.. అలా అని మొత్తం సామాజిక వర్గాన్ని తప్పుపట్టడం సరికాదని పలువురు ఆర్యవైశ్యులు ఆరోపిస్తున్నారు. వారంతా ఐలయ్యను తప్పుపడుతున్నా.. ఆయన మాత్రం తాను చేసింది కరెక్టే అని సమర్థించుకుంటూ.. మరింత రెచ్చగొడుతున్నాడు.

దీని పై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నివేదికలు తెప్పించుకొనగా , ఆంధ్రా ప్రభుత్వం ఇప్పటికే ఆ పుస్తకాన్ని నిషేధిస్తూ సంభందిత అధికారులకి మౌఖిక ఆదేశాలు జారీ చేసారు . అయితే అధికారికంగా ఎటువంటి ప్రకటనా వెలువడలేదు …మరోవైపు ఆర్య వైశ్యులు మాత్రం తీవ్ర ఆగ్రహావేశాలతో ఉండటమే గాక ఎక్కడికక్కడ రహస్య సమాలోచనలు పెట్టుకొని తదుపరి కార్యాచరణకి సిద్ధం అవుతున్నారు .

ప్రొఫెసర్ ఐలయ్య మాత్రం ఈ నిప్పుకి ఆజ్యం పోస్తూనే ఉండటం తో ఆంధ్రప్రదేశ్ డి జి పి .. ఐలయ్యను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆర్య వైశ్యులు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు స్టేషన్లలో చేసిన ఫిర్యాదుల ఆధారంగా ఐలయ్యను అరెస్టు చేయాలని సి ఐ డి అధికారులని ఆదేశించినట్లు తెలుస్తుంది .పుస్తకం విడుదల తర్వాత ఆయన వివిధ వేదికల పై మాట్లాడిన వీడియో లు ఆంధ్రా పోలీసులు సేకరించారు. ప్రజలను రెచ్చగొట్టేలా ఆయన చేసిన ప్రసంగాలను సుమోటోగా తీసుకొని అరెస్టు చేయాలని పోలీసులు భావిస్తున్నారు.