హైదరాబాద్: అనంతపురంలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చుక్కలు చూపించిన సీఐ గోరంట్ల మాధవ్ ఎట్టకేలకు వైసీపీ కండువా కప్పుకున్నారు. రాజకీయ ఉద్దండుడు అయిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని ఢీ కొట్టి సీఐ గోరంట్ల మాధవ్ అనంతపురం జిల్లాతోపాటు యావత్ తెలుగు రాష్ట్రాల్లోనే హల్ చల్ చేశారు.  

జేసీ దివాకర్ రెడ్డికి చుక్కలు చూపించిన సీఐ మాధవ్ ని వైసీపీలో చేర్చుకోవాలని ఆ పార్టీ జిల్లా నేతలు జగన్ పై ఒత్తిడి తీసుకువచ్చారు. అంతేకాదు సీఐ మాధవ్ ని కూడా ఒప్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవల తన ఉద్యోగానికి రాజీనామా చేశారు గోరంట్ల మాధవ్.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన శనివారం వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. సీఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలోనే వైసీపీ ప్రతిపాదనపై మాధవ్ ఆసక్తి కనబరిచారు. అయితే సీఐ పదవికి రాజీనామా చేసి రావాలని మాధవ్‌ను జగన్ సూచించడంతో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 

మాధవ్ సాక్షాత్తు అధికార పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై మీసం మెలేసి సంచలనం సృష్టించారు. టంగ్ స్లిప్ అయితే నాలుక కోస్తానంటూ జేసీకి వార్నింగ్ ఇచ్చారు. తాము ప్రజలకు సేవ చేసేందుకే పోలీసులమయ్యామని అంతేకానీ రాజకీయ నాయకులకు ఊడిగం చేసేందుకు కాదని తేల్చి చెప్పారు. 

ఖాకీ డ్రెస్ తీసేస్తే తాము అంతకంటే ఎక్కువ చెయ్యగలమంటూ సవాల్ విసిరారు. ఇకపోతే మాధవ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించి అంచలంచెలుగా సీఐ వరకు ఎదిగారు. ఆయన నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. 

రాజకీయాలను అడ్డంపెట్టుకొని దందాలు చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తారనే పేరుంది. పోలీస్ శాఖలో మంచి పేరు సంపాదించిన మాధవ్ రాజకీయ జీవితం ఎలా ఉంటుందో అన్నది కాలమే నిర్ణయించాలి.