చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ముగ్గురు పిల్లలతో కలిసి ఓ మహిళ వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం ప్రసన్నయ్యగారిపల్లె సమీపంలో ఈ సంఘటన జరిగింది. 

మూడు రోజుల క్రితం ఆ సంఘటన చోటు చేసుకోగా శనివారంనాడు వెలుగు చూసింది. శనివారం సాయంత్రం వ్యవసాయ బావి వద్దకు వచ్చిన గొర్రెల కాపరి ఈ మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బావిలోంచి శవాలను వెలికి తీయించి పుంగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల్లో తల్లి (30), ఆరేళ్ల బాలుడు, మూడు, నాలుగేళ్ల వయస్సు గల ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 

వారు ఎక్కడివారు, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే కోణంలో పోలీసులు దర్ాయప్తు చేస్తున్నారు. అనుమానాస్పద మృతికి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.