పవన్‌ పరిపక్వత లేని లీడర్, వైసీపీ డ్రామాలు: చెవిలో పూలతో ఎంపీ శివప్రసాద్

Chittoor MP Shivaprasad slams on Bjp and ysrcp
Highlights

వైసీపీపై శివప్రసాద్ హాట్ కామెంట్స్


తిరుపతి: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  పరిపక్వత లేని నాయకుడని  చిత్తూరు ఎంపీ శివప్రసాద్ విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో అర్ధం కాదన్నారు. రాష్ట్ర అభివృద్దికి  విపక్షాలు అడ్డుపడుతున్నాయన్నారు. కుటుంబం లేని ప్రధానమంత్రి మోడీకి ప్రజల బాధలు అర్ధం కావని ఆయన ఎద్దేవా చేశారు.


మంగళవారం నాడు ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై శివప్రసాద్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రం కోసం పనిచేస్తున్న తమపై విమర్శలు చేయడం తగదన్నారు.

ప్రధానమంత్రి మోడీ డైరెక్షన్ లో వైసీపీ నడుస్తోందన్నారు.వైసీపీ ఎంపీలు ఇప్పుడు రాజీనామాలు చేసినా ఎన్నికలు రావన్నారు. వైసీపీ ఎంపీలు మాయామాటలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.  

వైసీపీ నేతలు ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నారని  చెప్పారు.  మీడియా సమావేశంలోనే తన రెండు చెవుల్లో కాలిఫ్లవర్ పూలను పెట్టుకొన్నారు. సమావేశం కొనసాగినంత సేపు  చెవిలోనే పూలను ఉంచుకొని ఆయన మీడియాతో మాట్లాడారు. కుట్రలు, కుతంత్రాలతో అభివృద్దిని అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. కళాకారుడిగా పార్లమెంట్ ఎదుట నిరసన తెలిపాననని ఆయన గుర్తు చేశారు. ఏపీ ప్రజల బాధలను మోడీకి ఇతర బిజెపి నేతలకు అర్ధం కావాలనే ఉద్దేశ్యంతోనే తాను రకరకాల వేషాలు వేసి నిరసన వ్యక్తం చేసినట్టు ఆయన గుర్తు చేశారు. 

ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ అంటూ ప్రజలకు ఊకదంపుడు ఉపన్యాసాలు చెబుతారని, కానీ, ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలో మురికి కూపంగా ఉంటుందన్నారు. మోడీ మనసు స్వచ్చంగా పెట్టుకోరని ఆయన దుయ్యబట్టారు.

కుటుంబం ఉన్నవారికి ప్రజల సమస్యలు తెలుస్తాయన్నారు. మోడీకి కుటుంబం లేదన్నారు. అందుకే ప్రజల బాధలు ఆయనకు అర్ధం కావడం లేదన్నారు.అబద్దాలు చెప్పడంలో మోడీ దిట్టఅని శివప్రసాద్ విమర్శించారు. 
 

loader