హైదరాబాద్: మాజీ కేంద్రమంత్రి సీనీనటుడు మెగాస్టార్ చిరంజీవి వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను కలిశారంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. జగన్, చిరంజీవులు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే ఫోటోను చూస్తే రెండు రోజుల క్రితమే జగన్ ని చిరంజీవి కలిశారంటూ వార్తలు వస్తున్నాయి. 

వైఎస్ జగన్ తో చిరంజీవి భేటీ కావడం వెనుక ఆంతర్యం చాలా దాగి ఉందని ప్రచారం జరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఢీ కొట్టాలంటే జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఏకం కావాల్సిన పరిస్థితి. 

రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న చంద్రబాబును రాజకీయ చాణుక్యుడుగా పిలుస్తారు. ఎన్నికల సమయంలో ఏదో చేసి గెలుపొందేలా ప్లాన్ లు వేస్తారని అంతా చెప్పుకుంటారు. అలాంటి వ్యక్తిని ఢీ కొట్టాలంటే ఒక పార్టీ వల్ల సాధ్యం కాదన్నది బహిరంగ రహస్యం. 

ఇప్పటికే రాజకీయ నిపుణులు, రాజకీయవిశ్లేషకులు సైతం చంద్రబాబును ఇంటికి పంపాలంటే వైసీపీ, జనసేనలు ఏకం కావాల్సిందేనని బాహటంగానే చెప్తున్నారు. ఒకవేళ ఎవరికి వారు అన్నట్లుగా పోటీ చేస్తే చంద్రబాబు మళ్లీ విజయం సాధిస్తారంటూ ప్రచారం జరుగుతుంది. 

ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి చెందిన ప్రతినిధులు, వైసీపీ కి చెందిన నేతలతో ఇటీవలే భేటీ అయ్యారని ప్రచారం జరగుతోంది. ఆ భేటీలో జనసేన 45 అసెంబ్లీ స్థానాలను 8 పార్లమెంట్ స్థానాలను ఇవ్వాలంటూ ప్రతిపాదించినట్లు ప్రచారం జరుగుతోంది.  

ఇదే అంశాన్ని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి కళా వెంకట్రావు సైతం ఆరోపించారు. జనసేన పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు రహస్యంగా కలుసుకుంది వాస్తవం కాదా అంటూ నిలదీస్తున్నారు. అంతేకాదు ఆ రహస్య సమావేశంలో వచ్చిన సీట్ల సర్దుబాటు వ్యవహారాన్ని సైతం బహిర్గతం చేశారు కళా వెంకట్రావు. 

మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు ఇటీవల కాలంలో వ్యక్తిగత ఆరోపణలకు సైతం దిగారు. జగన్ మగతనం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడితే, నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడమేనా మగతనం అంటూ జగన్ కూడా ఘాటుగానే సమాధానం ఇచ్చారు. 

ఇలా ఇద్దరు నేతలు ఆరోపణలు ప్రత్యారోపణలతో రగిలిపోతున్నారు. ఇద్దరు నేతలు ఇగోలకు పోతున్నారని గమనించిన చిరంజీవి ఇక నేరుగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. చిరంజీవి మాటంటే పవన్ కళ్యాణ్ కు వేదవాక్కు. అటు జగన్ తో కూడా చిరంజీవికి మంచి సంబంధాలు ఉన్నాయి. 

ఈ నేపథ్యంలో ఇద్దరినీ కలిపేందుకు చిరంజీవి రంగంలోకి దిగారంటూ వార్తలు వస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత చిరంజీవి పలుమార్లు వైఎస్ జగన్ ను కలిశారు. లండన్ పర్యటనలో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా కలిశారు. ఆ తర్వాత ఇటీవలే వైఎస్ జగన్ పై దాడి ఘటనపై కూడా చిరు స్పందించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు నెలకొన్న పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీలో విలీనం ఆపై కేంద్రమంత్రి హోదా ఈ అంశాలన్నింటిని చిరంజీవి క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఇప్పుడు పూర్తి స్థాయిలో రాజకీయాలపై పట్టు సాధించారట.

చిరంజీవి ప్రజారాజ్యం పెట్టడం, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినప్పుడు అభిమానుల నుంచి ఎదురైన అనుభవాలను పరిగణలోకి తీసుకున్న చిరంజీవి ఇకపై అలాంటివి పునరావృతం కాకుండా ఉండాలని చూస్తున్నారట. అందుకే సోదరుడు పవన్ కళ్యాణ్ కు చక్కటి ప్లాట్ ఫాం ను రెడీ చేసేందుకు పావులు కదుపుతున్నారట. 

ప్రజలకు సేవ చెయ్యాలంటూ ఎంతో కసితో రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ కు జగన్ తోడైతే రాష్ట్రం మరింత బాగుపడుతుందని చిరంజీవి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఉభయగోదావరి జిల్లాలలో వైసీపీ, జనసేన పార్టీలు నువ్వా నేనా అన్నరీతిలో ఉన్న నేపథ్యంలో దాన్ని అందిపుచ్చుకునేందుకు కూడా చర్చించినట్లు తెలుస్తోంది. 

అటు తెలంగాణ సీఎం కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటికే ఆపన్న హస్తం అందించారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో చంద్రబాబును గద్దె దించడం సులువు అని రాజకీయ నిపుణులు చిరంజీవికి తెలియజేయడంతో ఆయనే నేరుగా రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. 

రెండు రోజుల క్రితం లోటస్ పాండ్ లో వైఎస్ జగన్ ను కలిసిన చిరంజీవి ఈ ప్రతిపాదనపై చర్చించినట్లు తెలుస్తోంది. అటు వినయ విధేయ రామ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు కేటీఆర్ ను గెస్ట్ గా పిలవడం అంతా చూస్తుంటే జగన్, పవన్ ను కలిపేందుకు చిరంజీవి చేస్తున్న ప్రయత్నాలు కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. 

వినయ విధేయ రామ మూవీ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కు ముఖ్యఅతిథిగా హాజరైన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను వైసీపీ అభిమానులు సైతం కలిశారు. చిరంజీవి సమక్షంలో వారంతా కేటీఆర్ ను ఆత్మీయంగా కౌగిలించుకోవడం కూడా జరిగింది. ఈ పరిణామాలన్నింటిని చూస్తే చిరంజీవి తెరవెనుక రాజకీయం చేసే పనిలో పడినట్లు తెలుస్తోంది. 

మెుత్తానికి అటు ఆంధ్రప్రదేశ్ లో జనసేన, వైసీపీలు ఏకం అయితే కొన్ని జిల్లాలలో క్లీన్ స్వీప్ ఖాయమని టీడీపీ గద్దె దిగడం కూడా ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఇద్దరు నాయకులు ఏం చేస్తారో వేచి చూడాలి.