అన్నన్యే తనకు ఇష్టమైన హీరో అని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సోమవారం నాడు గచ్చిబౌలిలో  చిరంజీవి అభిమానులు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు.


హైదరాబాద్: అన్నయ్యనే నా అభిమాన హీరో అని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అన్నయ్య సినిమాల్లోకి రాకముందు తాను అమితాబచ్చన్ ను అభిమానించేవాడినని చెప్పారు. అన్నయ్య హీరోగా అయ్యాక తన అభిమాన హీరో అన్నయ్యే అంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు.

చిరంజీవి అభిమానులతో గచ్చిబౌలిలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సోమవారం నాడు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి అభిమానులు జనసేనలో చేరారు. జనసేనను అభిమానులు గుండెల్లో పెట్టుకోవాల్సిందిగా కోరారు. తెలుగువారందరికీ అండగా నిలిచే పార్టీ జనసేన మాత్రమేనని ఆయన చెప్పారు.

అన్నయ్యపై అభిమానం పెరిగేదే కానీ, తరిగేది కాదని చెప్పారు. ప్రజల సమస్యలు పరిష్కరించేవారు లేనందునే తాను జనసేనను ఏర్పాటు చేయాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ చెప్పారు. 

జనసేన పార్టీ ఎవరిదో కాదని మెగాస్టార్‌ చిరంజీవి అభిమానుల్లో ఒకరిదని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. ఒకే కుటుంబంలో ఉన్నప్పటికీ భిన్న మనస్తత్వాలు ఉంటాయని చెప్పారు. తన గమ్యం తన అన్నయ్య గమ్యం ఒక్కటేనని వ్యాఖ్యానించారు.

 ప్రజా గాయకుడు గద్దర్‌ నుంచి ప్రతి కళాకారుడు తన మనసుకు దగ్గరైనవారేనని ఆయన చెప్పారు. కళాకారుడు రాజకీయాల్లోకి వస్తే భావోద్వేగాలను అర్థం చేసుకోగలడని వ్యాఖ్యానించారు.