మాజీ మంత్రి, వైసిపి ఎమ్మెల్యే కొొడాలి నాని తమ అభిమాన హీరో చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గుడివాడలో మెగా ఫ్యాన్స్ ఆందోళన చేపట్టారు.
గుడివాడ : వైసిపి ప్రభుత్వంపై ఇటీవల మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై ఏపీ రాజకీయాల్లో దుమారం రేగుతోంది. గతంలో రజనీకాంత్ పై మాటలదాడికి దిగినట్లే ఇప్పుడు చిరంజీవిపై కూడా వైసిపి నాయకులు మాటలదాడికి దిగుతున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి కొడాలి నాని తమ అభిమాన హీరోపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ మెగా అభిమానులు ఆందోళనకు దిగారు. దీంతో కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
కొడాలి నాని డౌన్ డౌన్... జై చిరంజీవ అంటూ మెగాస్టార్ అభిమానులు పెద్దఎత్తును నినాదాలు చేస్తూ గుడివాడ రోడ్లపైకి వచ్చారు. చిరంజీవి ఫోటోలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ పట్టణ వీధుల్లో ర్యాలీ చేపట్టారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని తమ అభిమాన హీరో చిరంజీవికి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
వీడియో
చిరంజీవి అభిమానులు చేపట్టిన ర్యాలీని గుడివాడ పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు, మెగా అభిమానులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీస్ వాహనాలకు అడ్డంగా రోడ్డుపై పడుకుని ఆందోళనకు దిగారు అభిమానులు. చిరంజీవి యువత అధ్యక్షుడు కందుల రవి, పలువురు అభిమానుల అరెస్ట్ చేసిన పోలీసులు మిగతావారిని అక్కడి నుండి చెదరగొట్టారు.
అరెస్ట్ సమయంలో చిరంజీవి అభిమానులు కొడాలి నాని పెద్ద చెకోడీ గాడు అంటూ మండిపడ్డారు.చిరంజీవి, వంగవీటి రంగా అభిమానుల ఓట్లతో గెలిచిన నాని ఇప్పుడు వారిపైనే విమర్శలు చేస్తున్నాడని అన్నారు. ఇలాంటి వాడిని వదిలిపెట్టబోమని... 2024 ఎన్నికల్లో బుద్ది చెబుతామని చిరంజీవి అభిమానులు హెచ్చరించారు.
